కేశినేని నాని వైసీపీలోకా...బీజేపీ లోకా ?
రాజకీయ సన్యాసం అన్నది ఒకపుడు పెద్ద పదం. ఆ ప్రకటన వచ్చిందా ఇక రాజకీయాలకు రాం రాం అనేసేవారు.;
రాజకీయ సన్యాసం అన్నది ఒకపుడు పెద్ద పదం. ఆ ప్రకటన వచ్చిందా ఇక రాజకీయాలకు రాం రాం అనేసేవారు. కానీ ఇపుడు అది ఒక పొలిటికల్ ట్విస్ట్ గా మారిపోయింది. అంతే కాదు తాత్కాలిక రాజకీయ విరామంగా కూడా దీనిని చూడాల్సి ఉంది.
తమకు తక్షణం ఏమీ తోచనపుడు అనుకున్న సమయం కోసం వేచి ఉండేందుకు అలా రాజకీయ సన్యాసం అన్న పదం వాడుతున్నారు. అందరూ చేసిందే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని కూడా చేశారు. ఆయన కూడా టీడీపీకి రెండు సార్లు ఎంపీగా వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికల ముందు వైసీపీలోకి మారిపోయారు. ఆ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు అది కూడా సొంత తమ్ముడు చేతులలోనే.
నిజానికి కేశినేని నాని చాలా ఊహించుకున్నారు. తనకంటూ సొంత బలం ఇమేజ్ ఉందని, దాంతో పాటు వైసీపీ లాంటి అధికార పార్టీ మద్దతు ఉంటే గెలిచి తీరుతాను అని అనుకున్నారు. అలా హ్యాట్రిక్ ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టి విజయవాడలో రాజకీయాన్ని తిరగరాయలని చూశారు.
కానీ ఆయన అనుకున్నది ఒకటైతే జనాల్ తీర్పు వేరొకటి అయింది. అందుకే కేశినేని నాని ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే రాజకీయాలకు రాం రాం అనేశారు. కానీ గత కొన్ని రోజుల నుంచి ఆయన హడావుడి చేస్తున్నారు. సొంత తమ్ముడు కేశినేని చిన్ని మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తమ్ముడు అవినీతిపరుడు అని ఎక్స్ పోజ్ చేస్తున్నారు. ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నారు అంటే కచ్చితంగా రాజకీయాల్లోకి తిరిగి రావడానికి అని అంటున్నారు. ఈ మధ్యనే ఆయన ఒకసారి తన నియోజకవర్గంలో పర్యటించారు.
అయితే కేశినేని నాని పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వాలే కానీ ఆయనను తమ పార్టీలో మరోసారి చేర్చుకునేందుకు వైసీపీ సిద్ధంగానే ఉంది అని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాయబేరాలు మొదలయ్యాయని అంటున్నారు. కేశినేని నాని సామాజిక వర్గానికే చెందిన వైసీపీ యువ నేత ఒకరు ఆయనను కలసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారని కూడా ఆ మధ్య ప్రచారం సాగింది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి నాని ఇపుడే ఏమీ చెప్పేది లేదని అంటున్నారు.
అదే సమయంలో నాని మనసు బీజేపీ మీద ఉందని అంటున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చాల మంచి పరిచయాలు ఉన్నాయి. దాంతో అందులోకి వెళ్ళి 2029 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది. కూటమికి ఏపీలో పెద్దన్నగా టీడీపీ ఉంది. దాంతో టీడీపీ అధినాయ్కత్వాన్ని ధిక్కరించి ఘాటు విమర్శలు చేసిన కేశినేని నానిని బీజేపీ తీసుకుంటే ఒప్పుకునే సీన్ లేదు. అందువల్ల కమలనాధులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ ఇలా హడావుడి చేస్తూ ఏ పార్టీలో లేకుండా తన ఉనికిని చాటుకోవాలని కేశినేని నాని చూస్తున్నారు అని అంటున్నారు. ఆ సమయానికి ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే అందులో చేరడం బెటర్ అన్న వ్యూహంతో ఉన్నారని అంటున్నారు. అపుడు వైసీపీ కూడా మరో ఆప్షన్ గా పెట్టుకున్నా తప్పు లేదు అని అంటున్నారు.
అయితే కేశినేని వంటి అంగబలం అర్ధబలం ఉన్న నాయకుడు విజయవాడ లాంటి రాజకీయ రాజధానిలో తమ వైపు ఉంటే ఎంతో లాభిస్తుందని వైసీపీ నమ్ముతోంది. అందుకే కేశినేని నానిని ఎన్నికల దాకా కాకుండా ఇపుడే చేర్చుకుని బెజవాడ పాలిటిక్స్ హీటెక్కించాలని చూస్తోంది. దాంతో నాని మీద ఒత్తిడి పెరుగుతోంది అని అంటున్నారు. మరి ఆయన త్వరలో ఫ్యాన్ నీడకు చేరుతారా లేక ఇదే మాదిరిగా ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేస్తూ సొంత తమ్ముడి పాలిటిక్స్ ని ఎండగడుతూ ఉంటారా అంటే ఏమో ఏమి జరుగుతుంది అన్నది వేచి చూడాల్సిందే.
మొత్తానికి కేశినేని నాని పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయమనే బెజవాడలో వినిపిస్తున్న మాట.