ఎంపీ అంటే ఏంటో తెలుసా.. కేశినేని చిన్నిపై పేర్ని నాని సెటైర్లు
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తన పదవికి, ఎంపీ ఉద్యోగానికి కొత్త నిర్వచనం తీసుకువచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.;
విజయవాడ కేంద్రంగా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీరుపై విపక్ష వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. గురువారం విజయవాడ ఎంపీ శివనాథ్ టార్గెట్ గా మీడియా సమావేశం నిర్వహించిన సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. ఎంపీ చిన్నిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అనుచరుల ద్వారా విజయవాడను దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ చిన్ని తమ సంగతి ఏదో చూస్తానని బెదిరిస్తున్నారని, ముందు ఆయన పాపాలు లెక్కపెట్టుకోవాలని హెచ్చరించారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తన పదవికి, ఎంపీ ఉద్యోగానికి కొత్త నిర్వచనం తీసుకువచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఎంపీ అంటే మొత్తం పీక్కుని లోపల వేసుకోవడమే అన్నట్లు కేశినేని శివనాథ్ తీరు ఉందని ఆక్షేపించారు. పెద్దిరెడ్డి అని ఆయన అనుచరుడి ద్వారా రేషన్ బియ్యం నుంచి నెలనెలా కోటిన్నర రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొత్త కంపెనీలు పెట్టి భూములు దోచేశారని, ఉర్సా కంపెనీ పేరిట ఎకరా రూపాయికే తీసుకున్నారని ధ్వజమెత్తారు.
అక్రమ వసూళ్లతో దోచుకుంటున్న ఎంపీ చిన్ని.. తమ సంగతి చూస్తానని బెదిరిస్తున్నారని, విజయవాడ ఉత్సవాలు ముగిసిన తర్వాత పేర్ని నాని, అవినాశ్, విష్ణు, వెల్లంపల్లిపై ద్రుష్టి పెడతానని చెబుతున్నారని ప్రస్తావించిన పేర్ని.. తమ వెంట్రుక కూడా పీకలేరని తేల్చిచెప్పారు. ముందు ఎంపీ చిన్ని పాపాలు లెక్కపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కాగా, విజయవాడ్ ఉత్సవ్ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
గొల్లపూడిలో ఒక ఆలయానికి చెందిన భూమిని "విజయవాడ ఉత్సవ్" కోసం లీజుకు ఇవ్వడంపై ఈ వివాదం మొదలైంది. నామమాత్రపు ధరకు లీజుకు ఇచ్చారని ఆరోపిస్తూ వైసీపీ, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై ఎంపీ కేశినేని చిన్ని, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని,. ఆలయానికి గణనీయమైన మొత్తాన్ని చెల్లించేలా చూశారు. అయితే దీనిపై ఆర్ఎస్ఎస్ అనుకూల వర్గాలు కోర్టును ఆశ్రయించడంతో లీజు రద్దు చేయాలని ఆదేశాలు వచ్చాయి. కాగా, ఈ వివాదంలో వైసీపీ నేతలు కేశినేని చిన్నిని టార్గెట్ చేయడం, దానికి చిన్ని కౌంటర్ ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.