అన్నదమ్ముల సవాల్.. టీడీపీకి ఎఫెక్ట్ అవుతుందా?
వ్యక్తిగత వివాదాలు.. కుటుంబ అంశాలను రాజకీయాల్లోకి తీసుకువస్తే.. అంతిమంగా నాయకులే నష్టపోతారన్న విషయం తెలిసిందే.
వ్యక్తిగత వివాదాలు.. కుటుంబ అంశాలను రాజకీయాల్లోకి తీసుకువస్తే.. అంతిమంగా నాయకులే నష్టపోతారన్న విషయం తెలిసిందే. కుటుంబ అంశాలను.. రాజకీయాలతో మిళితం చేసి విజయం దక్కించు కున్న వారు చాలా కొద్దిమందే ఉన్నారు. అయినప్పటికీ.. చాలా మంది నాయకులు ఇప్పటికీ.. వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలకు ముడిపెట్టి రచ్చ చేస్తున్నారు.
విజయవాడ ఎంపీ.. మాజీ ఎంపీ కేశినేని బ్రదర్స్‌గా పిలుచుకునే నాని-చిన్నిల మధ్య కొన్నేళ్లుగా వివాదా లు ఉన్నాయి. అవి కుటుంబ వివాదాలే తప్ప.. రాజకీయపరమైన వివాదాలు కావు. అయినప్పటికీ.. వారివు రు కూడా.. ఈ విషయాలను సామాజిక మాధ్యమాల్లో రాజకీయ వివాదాలుగా మార్చుకుని రచ్చ చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనివల్ల వ్యక్తిగతంగా వారికి ఎలా ఉన్నా.. ఎంపీ చిన్నీ ప్రాతినిధ్యం వహించిన టీడీపీ విషయంలో విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి.
నిజానికి విజయవాడలో టీడీపీకి బలమైన మద్దతు ఉంది. నగర పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలు ఉంటే .. రెండు చోట్ల టీడీపీనే విజయం దక్కించుకుంది. ఇక, విజయవాడ ఎంపీగా.. వరుస విజయాలు దక్కించు కున్న నాని, చిన్ని మారినా.. పార్టీ పరంగా టీడీపీనే 2014 నుంచి ఇప్పటి వరకు గెలుపు గుర్రం ఎక్కింది. అంతేకాదు.. 2019లో వైసీపీ హవా వీచినా.. విజయవాడ ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. అంటే.. ఇది వ్యక్తి బలం కన్నా.. పార్టీ బలానికి సంకేతంగా మారింది.
ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు.. వివాదాలకు దిగడం.. ఎంపీ చిన్ని.. తన అన్న నానీపై కేసు పెట్టడం వంటివి వారికి ఎలా ఉన్నా.. పార్టీ పరంగా నాయకులు చిన్నబోతున్నారన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఏదైనా వివాదం ఉంటే తేల్చు కునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ.. పార్టీ ప్రతిష్ఠకు నష్టం చేకూర్చేలా ఎవరూ వ్యవహరించరాదని పార్టీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ చిన్ని.. ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా వ్యక్తిగతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలన్న సూచనలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.