‘ఉర్సా’తో కూటమి పరువు పోయిందా..?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ప్రైవేటు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.;
ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ప్రైవేటు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బ్యాంకు ఆఫ్ బరోడా నిర్వహించిన సర్వేలో డొమిస్టిక్ పెట్టబడుల సాధనలో రాష్ర్టం టాప్ ప్లేస్ ను ఆక్రమించింది. అయితే ఈ స్పీడులో కొన్ని తప్పులు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తు్న్నాయి. ముఖ్యంగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేసిన ఫిర్యాదుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. రూ.5,728 కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం భూములు అప్పగించాలని నిర్ణయించింది. అయితే ఊరూ పేరు లేని, ఎలాంటి విశ్వసనీయత లేని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు భూ కేటాయింపుల వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పాత్ర ఉందని, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ఎంపీ చిన్ని అండ్ టీమ్ పావులు కదుపుతున్నారని స్వయంగా ఆయన సోదరుడు నాని ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడం దుమారం రేపుతోంది.
విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని స్వయాన అన్నదమ్ములు అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య చాలాకాలంగా రాజకీయ పోరు కొనసాగుతోంది. అయితే రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు అత్యంత సహజమైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవాన్నే ప్రశ్నించినట్లు చిన్ని స్కాంకు పాల్పడుతున్నాడని నాని చేసిన పోస్టుపై తీవ్ర చర్చ జరుగుతోంది. పొలిటికల్ సర్కిల్స్ లో ఏ ఇద్దరు కలిసినా ‘ఉర్సా’పైనే మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం జల్లెడ పడుతున్నారు.
తన ఫేస్ బుక్ పోస్టులో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ ‘‘ మీ నాయకత్వాన్ని, పార్టీ పేరును అవినీతి ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు అన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. పెట్టుబడి ముసుగులో ప్రభుత్వ భూములు దోచుకోబడకుండా మీరు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని నాకు నమ్మకం ఉంది’’ అంటూ మాజీ ఎంపీ కేశినేని నాని పోస్టు పెట్టడం వైరల్ అవుతోంది.
అదేవిధంగా ‘‘ఈ భూ కేటాయింపు నిజమైన పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉద్దేశించబడలేదు, వ్యక్తిగత లాభం కోసం ప్రభుత్వ యంత్రాంగాలను ఉపయోగించి రహస్యంగా భూ కబ్జా చేయడమే అని స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని అనుమతించడం వల్ల ప్రజా ప్రయోజనాలకు హాని జరగడమే కాకుండా, స్వచ్ఛమైన పారదర్శక పాలనను ఎల్లప్పుడూ కొనసాగిస్తామని చెప్పుకునే మీ పరిపాలన విశ్వసనీయత కూడా దెబ్బతింటుంది’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెచ్చరికతో కూడిన విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు.
సాధారణంగా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉర్సా విషయంలో ఎక్కడ బోల్తా కొట్టిందనే ప్రశ్న తలెత్తుతోంది. మాజీ ఎంపీ కేశినేని నాని లేవనెత్తిన అభ్యంతరాలపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎవరూ నోరు విప్పకపోవడంపైనా చర్చ జరుగుతోంది. నాని ఆరోపించినట్లు ఎంపీ చిన్ని సహచరులకు లబ్ధి చేసేలా ఇంతటి పొరపాటు చేస్తారా? ఇలా ఊరూపేరు లేని కంపెనీకి ప్రభుత్వ భూములు ఎలా ఇస్తారు? ఇది ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసే జరిగిందా? తొందరపాటులో ఏదైనా తప్పు దొర్లిందా? అన్న చర్చ జరుగుతోంది.
కేవలం రూ. 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్, రూ.లక్ష పెయిడ్-అప్ క్యాపిటల్ తో మొదలైన కంపెనీ, ఏపీతోపాటు తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై ఆన్ లైన్ వేదికగా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ కేశినేని నాని అన్నట్లు టీసీఎస్ కు 99 పైసలు చొప్పున భూమి కేటాయించడంపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. కానీ, ‘ఉర్సా’ విషయంలోనే రివర్స్ టాక్ వినిపిస్తోంది. ఈ కంపెనీ డైరెక్టర్లుగా చెబుతున్నవారిలో కౌశిక్ అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. సతీష్ ఎలిసియం అనలిటిక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ. వీరిద్దరే యూఎస్‌లో రిజిస్టర్ అయిన ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ డైరెక్టర్లు. అయితే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్రస్‌గా హైదరాబాద్ కొత్తగూడలో ఒక రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌ను చూపించారని అంటున్నారు. వాస్తవానికి అక్కడ ఎటువంటి కార్యాలయాలు లేవని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఎవరైనా తప్పుదారి పట్టించారా? ఈ భూ సంతర్పణ వెనుక ఎవరున్నారు? మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపణలు నిజాలేనా? కావా? అన్న చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా ఈ ఉదంతం కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిదని అంటున్నారు.