పెళ్లి మేకప్ కోసం వెళుతూ యాక్సిడెంట్.. ఐసీయూలో పెళ్లి

అయితే.. పెళ్లి మేకప్ కోసం వెళుతున్న వేళ.. అదుపు తప్పిన వారి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.;

Update: 2025-11-22 04:31 GMT

జీవితాంతం తోడు ఉంటానని పెళ్లి నాటి ప్రమాణాల్ని పక్కన పెట్టేసే జంటలు చాలా మందినే చూస్తున్న పరిస్థితి. అంతకు మించి.. పెళ్లి చేసుకున్న భాగస్వామిని కుట్ర పూరితంగా అంతమొందించే పాడు రోజులివి. ఇలాంటి రోజుల్లో పెళ్లికి ముందు ఉన్న అనుబంధానికి విలువనిస్తూ.. ఐసీయూలో ఉన్నప్పటికి పెళ్లాడిన వరుడి ఉదంతమిది. అనుకున్న ముహుర్తానికి అనుకున్న విధంగా పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశానికి వైద్యులు సైతం ఓకే చేయటంతో అరుదైన పెళ్లికి వేదికైంది కేరళలోని ఒక ఆసుపత్రి.

అలప్పుళలోని కొమ్మాడికి చెందిన ఆవనికి శుక్రవారం మధ్యాహ్నాం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే.. పెళ్లి మేకప్ కోసం వెళుతున్న వేళ.. అదుపు తప్పిన వారి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళుతున్న కారు చెట్టును ఢీ కొనటంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న ఇరు కుటుంబాలకు చెందిన వారు ఆసుపత్రికి వెళ్లారు.

అనుకున్న ముహుర్తానికి ముందుగా అనుకున్నట్లుగా వధువును పెళ్లాడాలన్న ఆలోచనను పెళ్లికొడుకు చెప్పటం.. అందుకు రెండు కుటుంబాలు ఓకే చేశాయి. దీంతో.. వైద్యులకు తాము అనుకున్న విషయాన్ని చెప్పటంతో.. వారు సైతం అంగీకరించారు. రోడ్డు ప్రమాదంలో దెబ్బలు తిన్న వధువు ఐసీయూలో ఉన్నప్పటికి పెళ్లికి అనుమతించారు.

దీంతో శరణ్ - అవనిల పెళ్లి జరిగింది. రోడ్డు ప్రమాదంలో పెళ్లికుమార్తెకు వెన్నుముకకు గాయం కావటంతో త్వరలోనే సర్జరీ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. అరుదైన పరిస్థితుల్లో పట్టు విడవకుండా పెళ్లి చేసుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News