పదేళ్లు పని చేసినోళ్లకు రూ.20 కోట్లతో ఖరీదైన కార్లు
ఈ గ్రూపు ప్రకటించిన ఈ భారీ ప్రకటన వాస్తవ రూపం దాలిస్తే సంస్థ టర్నోవర్ రూ.25 వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్ల మధ్యలో ఉంటుందని చెప్పాలి.;
కార్పొరేట్ రంగంలో కేరళకు చెందిన ఒక కంపెనీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమ కంపెనీ పెట్టి 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా 47 మంది ఉద్యోగులకు రూ.20 కోట్ల ఖర్చుతో అత్యంత ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. సాధారణంగా ఇలాంటి బహుమతులు.. దీపావళి సమయంలో గుజరాత్ కు చెందిన కొన్ని కంపెనీలు తరచూ ఇవ్వటం తెలిసిందే. ఇందుకు భిన్నంగా కేరళకు చెందిన హైలైట్ గ్రూపు తన ఉద్యోగుల్లోని సీనియర్ హోదాల్లో ఉన్న వారికి ఈ ఖరీదైన గిఫ్టులను ఇచ్చింది. 1996లో కేరళ రాష్ట్రంలో హైలైట్ గ్రూప్ ను స్టార్ట్ చేవారు. ఇటీవల ఈ సంస్థ 30 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.
దీనికి సంబంధించిన వేడుకలు కాలికట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రారంభం నుంచి ఉన్న వారితో పాటు, కంపెనీలో పదేళ్లుగా ఉంటున్న ఉద్యోగులకు ఈ ఖరీదైన బహుమతుల్ని అందజేశారు. ఉద్యోగులకు అందించిన కార్లలో రేంజ్ రోవర్.. ఆడి క్యూ8..లాండ్ రోవర్ డిఫెండర్.. టాటా హారియర్.. కియా సెల్టోస్.. క్రెటా.. స్కోడా కైలాక్ లాంటి మోడళ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా మరో ఆసక్తికర ప్రకటన చేసింది. ఉద్యోగులకు భారీ బహుమతుల్ని అందించిన రోజునే ఈ సంస్థ 2030నాటికి కేరళ వ్యాప్తంగా ఐదు కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులను చేపడతామని.. ఇందులో భాగంగా 2 లక్షల ఉద్యోగాల్ని సృష్టించనున్నట్లు వెల్లడించింది.
ఈ గ్రూపు ప్రకటించిన ఈ భారీ ప్రకటన వాస్తవ రూపం దాలిస్తే సంస్థ టర్నోవర్ రూ.25 వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్ల మధ్యలో ఉంటుందని చెప్పాలి. అదే జరిగితే ఈ సంస్థ లాభాలు రూ.4వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరు చేసిన ప్రకటన ఎంత భారీ అంటే.. భారతదేశపు అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ ఏడాదికి సుమారు10-15 మిలియన చదరపు అడుగుల విక్రయాన్ని చేపడుతుంది. హైలైట్ గ్రూపు 50 మిలియన్ చదరపు అడుగుల లక్ష్యాన్ని ప్రకటించిందంటే.. వారు కేరళను దాటి దక్షిణాదితో పాటు పాన్ ఇండియా స్థాయిలో ప్రాజెక్టులు చేపడతారన్న అంచనా వ్యక్తమవుతోంది.
ఇక..ఈ కంపెనీ బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే..1996లో కోజికోడ్ కేంద్రంగా మొదలుపెట్టారు. రిటైల్ స్పేస్.. లగ్జరీ ప్రాజెక్టులతో అగ్రగామిగా దీనికి పేరుంది. కేరళ నిర్మాణ రంగంలో రెడీ మిక్స్ కాంక్రీట్ ను పరిచయం చేసింది ఇతనే. అంతేకాదు కేరళలో మొట్టమొదటి షాపింగ్ మాల్ అయిన ఫోకస్ మాల్ 2007లో నిర్మించి.. ఆ రాష్ట్రంలో మాల్ కల్చర్ ను తీసుకొచ్చింది ఇతనే. రియల్ ఎస్టేట్ తో పాటు.. ది వైట్ స్కూల్ ఇంటర్నేషనల్.. ప్రసిద్ధ కేఫ్ చైన్ హగ్ ఏ మగ్ తో పాటు పలాక్సీ సినిమాస్ పేరుతో లగ్జరీ థియేటర్ల నిర్వహణతో పాటు.. ఇంటీరియర్ డిజైనింగ్.. హెల్త్ కేర్.. ఫండ్ మేనేజ్ మెంట్ రంగాల్లోనూ కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది.
ఈ సంస్థకు త్రిశూర్, కాలికట్ లో అతి పెద్ద లగ్జరీ మాల్స్ కలిగి ఉంది. కాలికట్ లో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ ప్రాజెక్టు.. 33 అంతస్తులతో కూడిన హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ఉంది. దీని ప్రత్యేకత ఏమంటే భారతదేశంలో అతి పెద్ద ఓపెన్ టెర్రస్ ఉంది. ఈ సంస్థ ఛైర్మన్ కం వ్యవస్థాపకుడు పి.సులైమాన్. వీరిలో ఉన్న గొప్పగుణం ఏమంటే.. తన వ్యాపారాన్ని పెంచుకుంటూ పోయినప్పటికి ఏ పార్టీకి దగ్గర కాకుండా తటస్థంగా వ్యవహరించే ధోరణి కనిపిస్తుంది.
హైలైట్ గ్రూప్ ను ఫ్యామిలీ రన్ చేస్తున్నా.. కార్పొరేట్ పోకడల్ని కలిగి ఉండటం ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ఇప్పటికే చెప్పినట్లుగా ఛైర్మన్ గా సులైమాన్.. సీఈవోగా అజిల్ ముహమ్మద్ (కొడుకు), కంపెనీ డైరెక్టర్లుగా కుమార్తె నిమా సులైమాన్, భార్య నషీదా సులైమాన్ లు వ్యవహరిస్తూ.. ఈ మొత్తం వ్యాపారాన్ని కుటుంబ కనుసన్నల్లోనే నిర్వహిస్తున్నారని చెప్పాలి. అదే సమయంలో కంపెనీ కార్యకలాపాలు కార్పొరేట్ పద్దతిలోనూ వారు నిర్వహించటం ఈ గ్రూప్ విలక్షణతగా చెప్పాలి.