ఇపుడు ఢిల్లీలో ఎన్నికలు పెడితే బీజేపీకి ఎన్ని సీట్లు ?
అందరికీ గుర్తుండే ఉంటుంది. 2025 లో ఇదే నెలలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 2013 నుంచి ఏకంగా 12 ఏళ్ల పాటు వరుసగా గెలుస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయింది.;
అందరికీ గుర్తుండే ఉంటుంది. 2025 లో ఇదే నెలలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 2013 నుంచి ఏకంగా 12 ఏళ్ల పాటు వరుసగా గెలుస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. 1998 తరువాత దాదాపు మూడు దశాబ్దాల అనంతరం కమలం పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో గెలిచింది. బీజేపీకి చెందిన రేఖా గుప్తా కొత్త ముఖ్యమంత్రి అయ్యారు. ఆం ఆద్మీ పార్టీ ఓటమి పాలు కావడమే కాదు ఏకంగా అధినేత ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ఓటమి పాలు అయ్యారు. ఇది నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టాక ఎన్నడూ చూడని ఘోర పరాజయం. దాంతో ఆం ఆద్మీ పార్టీ శ్రేణులు అన్నీ కృంగిపోయాయి. ఏడాదిగా చూస్తే కేజ్రీవాల్ సందడి ఎక్కడా లేదు, ఆయన మీడియాకి దూరం పాటిస్తూ వచ్చారు.
కట్ చేస్తే కన్నీరు :
దీనికి అంతటికీ కారణం లిక్కర్ స్కాం లో ఆమ్ ఆద్మీ పార్టీ నిండా కూరుకునిపోయింది అని జరిగిన రాజకీయ ప్రచారం. దానికి తగినట్లే సీబీఐ కేజ్రీవాల్ తో పాటు ఆప్ కి చెందిన కీలక నేతలు మంత్రులను కూడా అరెస్టు చేసింది. ఆ విధంగా అయిదు నెలలకు పైగా కేజ్రీవాల్ జైలు జీవితం అనుభవించారు. నిజాయితీతో కూడిన రాజకీయం కోసం తాను జనం లోకి వచ్చాను అని చెప్పుకునే కేజ్రీవాల్ తప్పు చేశారు అని లిక్కర్ స్కాం లో ఇరుక్కున్నారు అని జనాలు కూడా నమ్మే పరిస్థితి. బీజేపీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో చేసిన ప్రచారం దీనినే కేంద్ర బిందువుగా చేసుకుని సంధించిన అస్త్రాలు అన్నీ కలసి ఆప్ ఓటమి పాలు అయింది అయితే ఏడాది తిరగకుండానే ఈ కేసులో కేజ్రీవాల్ నిర్దోషీ అని తేలింది. ఆధారాలు ఏవీ లేవని కోర్టు అయితే స్పష్టమైన తీర్పు చెప్పింది. అంతే కాదు కేజ్రీవాల్ తో పాటు అనేక మందికి కూడా ఈ కోర్టు తీర్పు వల్ల ఎంతో ఊరట లభించింది. దీంతో తాజాగా వచ్చిన తీర్పుతో కేజ్రీవాల్ కన్నీటి పర్యంతం అయ్యారు. భావోద్వేగానికి గురి అయ్యారు.
ఇపుడు ఎన్నికలు పెడితే అంటూ :
ఇదిలా ఉంటే ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో సీబీఐ చార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం కొట్టివేసిన నేపధ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నేరుగా సవాల్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ కనీసంగా పది స్థానాలకు పైగా గెలిస్తే తాను రాజకీయాలను వదిలివేస్తానని కేజ్రీవాల్ గట్టిగా చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం పనితీరు పట్ల సంతోషంగా ఉన్నారని ఓడించడం కష్టమని తేలిన తరువాత బీజేపీ ఈ విధంగా తమ మీద కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు.
నేను నిజాయతీపరుడిని :
అంతే కాదు కేజ్రీవాల్ నిజాయితీపరుడని ఢిల్లీ ప్రజలకు తెలుసు కాబట్టి వారు నా నిజాయితీ పైనే దాడి చేశారని బీజేపీ అగ్ర నేతల మీద మండిపడ్డారు. బీజేపీ వారు నన్ను మద్యం కుంభకోణంలో ఇరికించారని వంద కోట్ల రూపాయల ఆరోపణలు చేశారని ఆయన ఆరోపించారు. నా జీవితంలో నిజాయితీ, గౌరవం తప్ప మరేమీ సంపాదించలేదని ఆయన చెప్పారు. తాను ఒక్క అక్రమ పైసా కూడా సంపాదించలేదని అంతే కాదు తాను వారిలా లేనని బీజేపీ మీద విమర్శలు చేశారు. తన మీద కుట్ర చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా మద్యం కుంభకోణం అని పిలువబడే దానిని తమ పార్తీకి వ్యతిరేకంగా వాడారని, ఈడీ సీబీఐ సహా అన్ని కేంద్ర సంస్థలను ఉపయోగించుకున్నారని ఆప్ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రేజీ సవాల్ మీద :
మరి కేజ్రీవాల్ సవాల్ కి బీజేపీ నేతలు స్పందిస్తారా అన్నది చూడాలి. ఇపుడు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు తిరిగి నిర్వహిస్తారా అన్నది కూడా ఆలోచించాలి. అయితే అలాంటిది ఎవరూ చేయరు, చేసే సాహసం కూడా చేయరని అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు అంటే నిజంగా కేజ్రీవాల్ చెప్పినట్లు బీజేపీకి 10 సీట్లు రాకపోయినా గెలుపు మళ్లీ దక్కుతుందా అంటే అది కూడా ఆలోచించాల్సిందే అని అంటున్నారు.