కేసీఆర్ ని నిలదీయాలని ప్రిపేర్ అయిన రేవంత్...కానీ !

ఇక ఈ విషయం మీద అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.;

Update: 2026-01-03 15:19 GMT

కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి వస్తారని శీతాకాల సమావేశాలు కాస్తా చలిలో సెగ పుట్టిస్తాయని అంతా ఊహించారు దానికి తగినట్లుగానే తొలి రోజు సభకు కేసీఆర్ రావడం చూసి ఈసారి తెలంగాణా అసెంబ్లీ లో అటు రేవంత్ ఇటు కేసీఆర్ అని అంతా ఆసక్తిని చూపించారు. కానీ జస్ట్ ఇలా వచ్చి అలా కేసీఆర్ సభ నుంచి వెళ్ళిపోయారు. నీటి వివాదాల మీద చర్చకు అయినా వస్తారు అని కూడా అంతా భావించారు. కానీ అదీ జరగలేదు, చిత్రమేంటి అంటే ఆఖరుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సభను బహిష్కరించడం. మొత్తానికి చూస్తే కేసీఆర్ సభకు వస్తారని అందరితో పాటు కాంగ్రెస్ కూడా బాగానే ప్రిపేర్ అయింది. కానీ చివరి నిముషంలో బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం మూలంగా కాంగ్రెస్ లోనూ కొంత అసంతృప్తి కనిపించింది.

ఫుల్ ప్రిపేర్ అయినా కాంగ్రెస్ :

కేసీఆర్ ఈసారి సభకు హాజరు కావడం పక్కా అని కాంగ్రెస్ నీటి వివాదలా మీద ఫుల్ గా ప్రిపేర్ అయింది. ఎంతో కసరత్తు చేసి మరీ సభకు వచ్చింది. రేవంత్ రెడ్డి అయితే అలవోకగా నీటి ప్రాజెక్టుల విషయంలో గణాంకాలను అన్నీ కలిపి చెబుతున్న తీరుని చూసిన వారికి కాంగ్రెస్ ఈ సబ్జెక్ట్ విషయంలో ఎంతటి పట్టుదలగా ఉంది అన్నది అర్థం అయింది. అయితే సభలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది కానీ ప్రధాన విపక్షం లేని అసెంబ్లీలో కాంగ్రెస్ ఎంత చెప్పినా కూడా వన్ సైడ్ అన్నట్లుగానే సాగింది.

కేసీఆర్ ని అడగాలని :

ఇక ఈ విషయం మీద అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కృష్ణా నదీ జలాల విషయంలో ఆ ప్రాజెక్టుల మీద తెలంగాణాకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయన ఎందుకు ఇలా చేశారు అని సభకు వస్తే నేరుగా కేసీఆర్ నే అడుగుదామని అనుకున్నాను అని రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం. ఒక వేళ కేసీఆర్ ని ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా తప్పు తోవ పట్టించారా అని కూడా ఆయన ప్రశ్నించడం గమనార్హం. అంతే కాదు ఈ విషయం మీద రెండు రాష్ట్రాల తగాదాలు కాదు, కర్ణాటక నుంచి ముందు జల వివాదాలను పరిష్కరించుకోవాలని కూడా రేవంత్ రెడ్డి అనడం ప్రస్తావించాల్సిన విషయం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయతీలు నీటి వివాదాల విషయంలో ఉన్నాయని అయితే అంతా కలసి కర్ణాటక ఈ విషయంలో చేస్తున్న అన్యాయం మీద పోరాడాల్సి ఉందని రేవంత్ రెడ్డి చేసిన సూచన కూడా సబబుగా ఉందని నీటి ప్రాజెక్టులకు సంబంధించిన నిపుణులు అంటున్నారు.

ముందే ఊహించారా :

ఇక సభకు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మీద విమర్శలు చేస్తారని సూటింగా కొన్ని అంశాలలో ప్రశ్నిస్తారని ముందే కేసీఆర్ ఊహించి సభకు రాకుండా దూరం పాటించారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా నీటి వివాదాల మీద మొదట గొంతు ఎత్తిందే బీఆర్ ఎస్. ఆ మీదట సభలో తేల్చుకోవాలని చూసింది కూడా. కానీ చివరికి సభకు హాజరు కాకుండా డుమ్మా కొట్టడం మీద అయితే హాట్ డిస్కషన్ సాగుతోంది.

Tags:    

Similar News