హెచ్-1బీ ఉన్నా అమెరికా కల 'కల'గానే.. వీసా చేతిలో ఉన్నా భారత్‌లోనే బందీ!

వీసా ఉన్నా ఆమెను ఆన్‌సైట్‌కు పిలవకపోవడానికి ప్రధాన కారణం ఆర్ధిక భారం. క్లయింట్ సంస్థలో నాయకత్వ మార్పులు రావడం.. ఖర్చులు తగ్గించుకోవాలనే నిర్ణయం తీసుకోవడం ఆమె పాలిట శాపంగా మారింది.;

Update: 2026-01-04 16:30 GMT

ఒకప్పుడు హెచ్-1బీ వీసా అంటే అమెరికాలో ఉజ్వల భవిష్యత్తుకు పాస్ పోర్ట్. కానీ ఇప్పుడు వీసా అనేక మంది పాలిట సంకేళ్లుగా మారుతోంది. వీసా అప్రూవల్ వచ్చి.. స్టాంపింగ్ పూర్తయినా ఏడాదిన్నరగా భారత్ లోనే ఉండిపోవాల్సి వస్తున్న ఒక యువతి దీన కథ ఇదీ.. ప్రస్తుత ఐటీ రంగంలోని గందరగోళానికి అద్దం పడుతోంది.

ఆశలున్నా.. ప్రయాణం లేదు..

హెచ్1బీ వీసా ప్రక్రియలో లాటరీ తగలడమే అదృష్టం అనుకునే రోజులు పోయి ఇప్పుడు లాటరీ తగిలి అప్రూవల్ వచ్చి పాస్ పోర్ట్ పై స్టాంపింగ్ పడ్డా కూడా అమెరికా వెళ్లలేని విచిత్ర పరిస్థితి నెలకొంది. తాజాగా ఒక 28 ఏళ్ల యువతి ఎదుర్కొంటున్న ఇబ్బంది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 2025 నవంబరులోనే ఆమెకు వీసా ఆమోదం లభించింది. కానీ నేటికి ఆమె భారత్ లోనే ఉండి క్లయింట్ కోసం రాత్రిపూట విధులు నిర్వర్తిస్తోంది.

క్లయింట్ల 'కాస్ట్ కటింగ్' మంత్రం

వీసా ఉన్నా ఆమెను ఆన్‌సైట్‌కు పిలవకపోవడానికి ప్రధాన కారణం ఆర్ధిక భారం. క్లయింట్ సంస్థలో నాయకత్వ మార్పులు రావడం.. ఖర్చులు తగ్గించుకోవాలనే నిర్ణయం తీసుకోవడం ఆమె పాలిట శాపంగా మారింది. ఉద్యోగిని అమెరికా తీసుకెళ్లడానికి అయ్యే ప్రయాణ, వసతి ఖర్చులను భరించడానికి కంపెనీలు వెనకాడుతున్నాయి. అమెరికాలో ఉండి చేసే పనిని భారత్ నుంచే తక్కువ జీతంతో చేయించుకోవచ్చనే ధోరణి క్లయింట్లలో పెరిగింది. భారత్ నుంచి పనిచేస్తున్నా కనీసం జీతం పెంచడానికి కూడా క్లయింట్లు ఒప్పుకోవడం లేదు.

నిలిచిపోయిన వ్యక్తిగత జీవితం

గత ఏడాదిన్నరగా నా జీవితం స్తంభించిపోయింది అని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కేవలం కెరీర్ మాత్రమే కాదు.. ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఈ అనిశ్చితిలో చిక్కుకుంది. ఏ దేశంలో ఉండాలో క్లారిటీ లేకపోవడంతో పెళ్లి సంబంధాలు కూడా చూసుకోలేకపోతున్నాను. చేతిలో వీసా ఉండి కూడా భవిష్యత్తు అంధకారంగా మారింది అని ఆమె పేర్కొన్నారు.

మారిన నిబంధనలు.. పెరిగిన నిఘా

అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం (యూఎస్.సీఐఎస్) ఇటీవల కాంప్లయెన్స్ రూల్స్‌ను కఠినతరం చేసింది. దీనివల్ల కంపెనీలు హెచ్-1బీ ఉద్యోగులను నియమించుకోవడానికి భయపడుతున్నాయి. ఒకవేళ ఉద్యోగి కంపెనీ మారదామనుకున్నా.. కొత్తగా హెచ్-1బీ ట్రాన్స్‌ఫర్ పిటిషన్లు వేయడం.. భారీ ఫీజులు చెల్లించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాహసంతో కూడుకున్న పనిగా మారింది.

హెచ్-1బీ అంటే ఒకప్పుడు గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అది ఒక భయానక నిరీక్షణగా మారిపోయింది. కేవలం ఈ యువతి మాత్రమే కాదు.. ఇలాంటి అనిశ్చితిలో వందలాది మంది భారతీయ ఐటీ నిపుణులు కొట్టుమిట్టాడుతున్నారు. విదేశీ కల తీరక, స్వదేశంలో ప్రశాంతత లేక 'హెచ్-1బీ' బాధితులుగా మిగిలిపోతున్నారు.

Tags:    

Similar News