భారత్ లోనే 2036 ఒలింపిక్స్.. మోదీ చెప్పేశారు
2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రధాన మోదీ తెలిపారు. మన దేశంలో గత పదేళ్లలో పలు అంతర్జాతీయ క్రీడా పోటీలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.;
2028 ఒలింపిక్స్ అమెరికాలో... 2032లో ఆస్ట్రేలియాలో... మరి 2036లో..? ఇంకెక్కడ..? మన భారత దేశంలోనే మహా క్రీడా సంబరం. ప్రతిష్ఠాత్మక విశ్వ క్రీడల నిర్వహణ అంటే మామూలు మాటలు కాదు. వీటి ద్వారా దేశ ప్రతిష్ఠ అమాంతం పెరుగుతుంది. భారత్ ఒక డెవలప్డ్ కంట్రీగా ప్రపంచానికి తెలుస్తుంది. 2024లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నిర్వహించిన ఒలింపిక్స్ ఖర్చు దాదాపు రూ.63 వేల కోట్లు. అత్యంత పర్యావరణ హిత పద్ధతుల్లో నిర్వహించిన నేపథ్యంలో ఖర్చు తగ్గిందని చెబుతుంటారు.
ఇదే 2036లో ఒలింపిక్స్ కు ఎంత వ్యయం కానుంది? అంటే.. రూ.లక్షన్నర కోట్లు వరకు అని చెప్పొచ్చు. కాగా, 2036లో విశ్వ క్రీడల నిర్వహణకు భారత్ ఇప్పటికే బిడ్ దాఖలు చేసింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ పేరిట బిడ్ వేసింది. దీనికిముందే 2030 కామన్వెల్త్ క్రీడలనూ ఇక్కడే నిర్వహించనున్నారు. తద్వారా విశ్వ క్రీడల విషయంలో భారత సంసిద్ధతను చాటినట్లు అవుతుంది. చివరగా బిడ్ దక్కితే.. చరిత్రలో తొలిసారి భారత్ కు ఒలింపిక్స్ ఆతిథ్యం దక్కినట్లు అవుతుంది.
మోదీ నోటి వెంట...
2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రధాన మోదీ తెలిపారు. మన దేశంలో గత పదేళ్లలో పలు అంతర్జాతీయ క్రీడా పోటీలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ చాంపియన్ షిప్ పోటీలను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి మాట్లాడారు. అండర్ 17 ఫిఫా ప్రపంచ కప్, హాకీ ప్రపంచ కప్, చెస్ టోర్నీ, టి20 ప్రపంచ కప్ (2016), 2023లో వన్డే ప్రపంచ కప్.
సహా గత పదేళ్లలో మన దేశంలో 20పైగా అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించిన నిర్వహించామని.. 2030 కామన్వెల్త్ క్రీడలు కూడా భారత్ లోనే (అహ్మదాబాద్) జరగనున్నట్లు తెలిపారు. కాగా, వారణాసిలో ఆదివారం ప్రారంభమైన వాలీబాల్ జాతీయ చాంపియన్ షిప్ పోటీలు ఈ నెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. 58 జట్ల నుంచి వెయ్యి మంది పైగా ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ప్రధాని మోదీ నియోజకవర్గం అయిన వారణాసి ఇక మీదట జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వేదిక కానుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
అబూజాతో పోటీ పడుతూ..
2036 ఒలింపిక్స్ కోసం నైజీరియా రాజధాని అబూజా సహా పలు నగరాలు పోటీలో ఉన్నాయి. అయితే, వీటన్నిటి కంటే అహ్మదాబాద్ వైపే ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. బిడ్ మన దేశానికే దక్కే అవకాశం ఉంది. ఇక 20 ఏళ్ల తర్వాత 2030లో కామన్వెల్త్ క్రీడలు అహ్మదాబాద్ లో జరగనున్నాయి. 2010లో ఈ క్రీడలు ఢిల్లీలో నిర్వహించారు. ఒకప్పటి బ్రిటిష్ పాలిత దేశాల మధ్య జరిగేవే కామన్వెల్త్ క్రీడలు.