తొడగొట్టిన మదురోను ఇలా పడగొట్టాం.. అమెరికా వైట్ హౌస్ వీడియో వైరల్

తాజాగా మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత వైట్ హౌస్ సరిగ్గా అదే పాత వీడియోను వాడింది.;

Update: 2026-01-04 19:13 GMT

తొడగొట్టిన మదురోను పడగొట్టాం అంటూ అమెరికా వైట్ హౌస్ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ఒక దేశ అధ్యక్షుడిని వారి దేశంలోకి వెళ్లి మరీ పట్టుకురావడం అంటే అది మామూలు విషయం కాదు.. దీన్నే అమెరికా చేసి చూపించింది. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్‌తో దక్షిణ అమెరికా రాజకీయాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. అయితే ఈ అరెస్ట్ కంటే కూడా దీనిపై అమెరికా వైట్ హౌస్ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. "రమ్మన్నావుగా.. వచ్చాం.. పట్టుకెళ్తున్నాం" అనే రేంజ్‌లో వైట్ హౌస్ ఒక పవర్‌ఫుల్ వీడియోను విడుదల చేసింది.

మదురో సవాల్.. అమెరికా కౌంటర్

కొన్ని నెలల క్రితం అమెరికా తనపై రివార్డు ప్రకటించినప్పుడు మదురో అత్యంత ఆవేశంగా ప్రసంగించారు. "మీకు దమ్ముంటే రండి.. నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. అధ్యక్ష భవనం మిరాఫ్లోరెస్‌లోనే ఉంటాను, మీ కోసం ఎదురుచూస్తుంటాను" అంటూ బహిరంగంగా సవాల్ విసిరారు.

తాజాగా మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత వైట్ హౌస్ సరిగ్గా అదే పాత వీడియోను వాడింది. మదురో సవాల్ విసిరిన క్లిప్పింగ్‌కు అమెరికా సైన్యం నిర్వహించిన తాజా ఆపరేషన్ విజువల్స్‌ను జోడించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను ఎడిట్ చేసి వదిలింది.

ఆపరేషన్ మిరాఫ్లోరెస్: అసలేం జరిగింది?

అమెరికా సైన్యం అత్యంత రహస్యంగా మెరుపు వేగంతో వెనిజులా అధ్యక్ష భవనంలోకి చొరబడి మదురోను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మదురో ఆచూకీ తెలిపిన వారికి ఇచ్చే బహుమతిని గతంలో అమెరికా 50 మిలియన్ డాలర్లకు పెంచింది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం ఈ ఆపరేషన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. "అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే ఎవరినైనా వదిలిపెట్టం" అనే సందేశాన్ని ఈ చర్య ద్వారా పంపింది.

వైట్ హౌస్ వీడియోలో హైలైట్స్

వైట్ హౌస్ విడుదల చేసిన వీడియోలో కొన్ని కీలక అంశాలు హైలైట్‌గా నిలిచాయి. ఆలస్యం చేయొద్దు.. ఇప్పుడే రండి అని మదురో అంటున్న పాత వీడియో క్లిప్ ను జోడించి అత్యాధునిక ఆయుధాలతో అమెరికా బలగాలు జరిపిన ఆపరేషన్ దృశ్యాలు కనిపించాయి.. వీడియో చివర్లో అవకాశాన్ని అందిపుచ్చుకున్నాం అనే వ్యంగ్య సందేశంతో వీడియోను ముగించారు.


Tags:    

Similar News