స్నేక్ గ్యాంగ్ మళ్లీ పడగ విప్పుతోందా..?
మద్యం మత్తులో ఉన్న ఆ డ్రైవర్ ఆటోలో దాచిన పామును బయటకు తీసి నేరుగా పోలీసుల వైపు మళ్లించాడు.;
నగరాన్ని ఒకప్పుడు వణికించిన 'స్నేక్ గ్యాంగ్' పేరు వింటేనే ఇప్పటికీ భాగ్యనగర వాసులు ఉలిక్కిపడుతుంటారు. తాజాగా చాంద్రాయణగుట్టలో జరిగిన ఒక వింత ఘటన ఆ భయంకరమైన రోజులను గుర్తుకు తెచ్చింది. ట్రాఫిక్ పోలీసులనే పాముతో బెదిరించిన ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు సాధారణంగా చేసే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఒక ఆటో డ్రైవర్‌ను ఆపి పరీక్షించగా అతను మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. నిబంధనల ప్రకారం పోలీసులు ఆటోను సీజ్ చేయడానికి ప్రయత్నించగా ఆ డ్రైవర్ అసలు స్వరూపం బయటపడింది.
మద్యం మత్తులో ఉన్న ఆ డ్రైవర్ ఆటోలో దాచిన పామును బయటకు తీసి నేరుగా పోలీసుల వైపు మళ్లించాడు. "నా ఆటో నాకు ఇచ్చేయండి.. లేదంటే పామును మీపైకి వదులుతా" అంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
పోలీసుల సాహసం.. నిందితుడి అరెస్ట్
పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. పాముతో భయపెడుతున్న అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. పామును స్వాధీనం చేసుకుని నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పాత రోజులు గుర్తొస్తున్నాయి..
ఈ ఘటనతో ప్రజలు మళ్లీ పహాడీ షరీఫ్ స్నేక్ గ్యాంగ్ అరాచకాలను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో పాములతో ప్రజలను, ముఖ్యంగా యువతులను భయపెట్టి అత్యాచారాలు, దోపిడీలకు పాల్పడిన ముఠా నగరంలో సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఆ కేసులో నిందితులకు జీవిత ఖైదు పడినప్పటికీ మళ్లీ ఇప్పుడు పామును ఆయుధంగా వాడుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ ఇలాంటి వింతైన , భయంకరమైన పద్ధతుల్లో నేరాలకు పాల్పడటం ఆందోళనకరం. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.