కేసీఆర్ కి ఆ ఫ్యాక్టర్ ప్లస్ అవుతుందా ?

ఇక కేసీఆర్ ని ఎవరూ ఎపుడూ తక్కువ అంచనా వేయలేరు. ఆయన పడి లేచే కడలి తరంగం లాంటి వారు. దానికి గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.;

Update: 2026-02-23 03:53 GMT

తెలంగాణా రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. కేసీఆర్ అధికారం కోల్పోయాక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దూకుడు చేస్తున్నారు. కేసీఆర్ మంచి వక్త. తమ ప్రసంగంలో సామెతలు మాండలికాలు పడికట్టు పదాలు ఊత పదాలు జనసామాన్యంలో అనుకునే మాటలు, సాధారణ ప్రజలు చెప్పుకునే మాటలు అన్నీ దొర్లిస్తారు. ఆ విధంగా నేరుగా వారికి కనెక్ట్ అయ్యేలా తన స్పీచ్ ని ఇస్తారు. అంతే కాదు రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేసినపుడు అయితే చెలరేగిపోతారు. తాను ఆవేశపడడమే కాదు జనాలను కూడా ఆ మూడ్ లోకి తీసుకుని వెళ్ళగల సమర్ధత ఆయన ప్రసంగాలకు ఉంది. ఇక కేసీఆర్ తరువాత అంతటి వక్త సందర్బోచితంగా మాట్లాడే నేతలు పెద్దగా ఎవరూ లేరు కానీ కాంగ్రెస్ సీఎం గా రేవంత్ రెడ్డి తనదైన మాటలతో చెణుకులతో కేసీఆర్ ని బాగానే ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రసంగాలు కూడా బాగానే రక్తి కట్టిస్తారు. జనాలను కూర్చోబెట్టి గంటల తరబడి మాట్లాడడంలో రేవంత్ రెడ్డి సైతం ధీటుగానే ఉంటారు.

మౌనమే ఆయుధంగా :

ఇక కేసీఆర్ ని ఎవరూ ఎపుడూ తక్కువ అంచనా వేయలేరు. ఆయన పడి లేచే కడలి తరంగం లాంటి వారు. దానికి గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 2000 లో ఆయన తెలుగుదేశాన్ని ఉప సభాపతి పదవిని వదిలేసి బయటకు వచ్చినపుడు ఆయన రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అని అనుకున్నారు. ఎందుకంటే బయటకు వచ్చింది ఒక్కరే. పైగా ఈ బక్కపలచని కేసీఆర్ ఏమి చేయగలరు అని భావించారు. కానీ ఆయన మలి విడత తెలంగాణా ఉద్యమాన్ని ఒడుపుగా మలచి ఏకంగా కాంగ్రెస్ టీడీపీ బీజేపీ సహా అన్ని పార్టీల చేత జై తెలంగాణా అనిపించారు. ఇక అదే టైం లో ఆయనకు వైఎస్సార్ ఉమ్మడి ఏపీ సీఎం గా ఉంటూ గట్టిగానే ఎదురొచ్చారు. వైఎస్సార్ టైం లో జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు నష్టపోయింది కూడా. అయితే 2009 లో వైఎస్సార్ మరణం తరువాత అదే ఏడాది నవంబర్ 29న కేసీఆర్ అమరణ దీక్ష అంటూ ఒక భారీ సంచలనానికి తెర తీసి ఏకంగా అదే ఏడాది డిసెంబర్ 9న తెలంగాణా రాష్ట్ర ప్రకటన యూపీయే ప్రభుత్వం చేత చేయించేలా చేశారు.

పెద్దాయనగా :

కేసీఆర్ తాజా పుట్టిన రోజుతో 73వ పడిలో పడ్డారు. ఆయన వయసు రిత్యా పెద్దాయనగా జనంలో ఉన్నారు. ఇక ఎవరు ఎలా విమర్శలు చేసినా కేంద్ర పెద్దలతో కొట్లాడి తెలంగాణాను తెచ్చిన ఉద్యమ నేతగా జనాలు ఎప్పటికీ ఆయనను గుర్తు పెట్టుకుంటారు. ఈ క్రెడిట్ అయితే ఆయనకు ఉంటుంది. మరో వైపు చూస్తే పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో మేలు జరిగింది. అలాగే కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయి. వీటికి మించి కేసీఆర్ జనంలోకి పెద్దగా రాకపోవడం కూడా విమర్శల పాలు అయింది. ఈ నేపధ్యంలోనే ఆయనకు ఓటమి దక్కింది. అయినా సరే రెండేళ్ళ కాంగ్రెస్ పాలన తరువాత కొంత యాంటీ ఇంకెంబెన్సీ పెరిగింది. అది ఎంత పెరిగితే అంత బీఆర్ఎస్ ఖాతాలోకే అడ్వాంటేజ్ గా వెళ్తుందని విశ్లేషణలు ఉన్నాయి.

వయసు అనుకూలం :

ఇక కేసీఆర్ విషయం చూస్తే పెద్దాయన అయిపోయాడు ఈ ఏజ్ లో ఆయన మీద విమర్శలు చేయడం అన్నది తగదు అన్నది అయితే ఉంటుంది. అందుకే కేసీఆర్ మౌనంగా ఉంటూనే జనాలలో సానుభూతిని పెంచుకోవాలని చూస్తున్నారు. తన మీద కాంగ్రెస్ నేతలు ఎవరు విమర్శలు చేసినా ఆయన మౌనంతోనే జవాబు ఇస్తున్నారు. జనాలు అన్నీ చూసుకుంటారు అన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఏపీలో చూస్తే అదే జరిగింది. ఏడున్నర పదుల వయసులో చంద్రబాబు ఉంటే వైసీపీ నేతలు ఆయన మీద విమర్శలు పెద్ద ఎత్తున చేస్తూ పోయారు. చివరికి బాబుకు అది ప్లస్ అయింది. జనాలు ఎక్కువగా భావోద్వేగానికి కూడా గురి అవుతూంటారు. రాజకీయాల్లో ఇవన్నీ వర్కౌట్ అవుతూంటాయి. విమర్శలు ప్రతి విమర్శల నేపధ్యంలో నాయకులు అందునా అధికారంలో ఉన్న వారు వీటిని పెద్దగా గుర్తించరు. కానీ ప్రతీదీ కౌంట్ అవుతూ ఉంటుంది అని అంటున్నారు. అందుకే కేసీఅర్ మౌనమే నా భాష అంటున్నారు. చూడాలి మరి ఈ సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అయి గులాబీ తోటలో పూవులు పూయిస్తుందో.

Tags:    

Similar News