కేటీఆర్ కోసం కేసీఆర్ మౌనవ్యూహం! కవిత సంగతి ఏంటో?
2023లో ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన తర్వాత ఎర్రవల్లి ఫాం హౌజుకు వెళ్లిన కేసీఆర్.. ఒకటి రెండు సార్లు మాత్రమే రాజకీయ కార్యకలాపాలను నిర్వహించారు.;
తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీపై పట్టు కోసం అధినేత కేసీఆర్ కుమారుడు, కుమార్తె మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ విషయంపై అధినేత కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, పరిస్థితులను గమనిస్తే కుమారుడు కేటీఆర్ కి పగ్గాలు అప్పగించడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు. తాజా రాజకీయాలు ఇవే సంకేతాలిస్తున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా రాజకీయం మారుతోందని అంటున్నారు. కేసీఆర్ కూడా సరిగ్గా ఇదే ఆశిస్తున్నారని చెబుతున్నారు. పార్టీపై కేటీఆర్ పూర్తి పట్టు సాధించేలా కేసీఆర్ దారులు చూపుతున్నారని అంటున్నారు. అందుకే రాజకీయంగా కీలక అంశాలపై కూడా ఆయన మాట్లాడటం లేదంటున్నారు. ఇటీవల బీఆర్ఎస్ రాజకీయంగా చాలా ప్రాధాన్యతాంశంగా తీసుకున్న ‘బనకచర్ల’పై కూడా అధినేత మాట్లాడకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.
సహజంగా ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు, ప్రజల్లో తెలంగాణ భావోద్వేగాన్ని తట్టి లేపెందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఆంధ్రాతో ముడిపడిన అంశాన్ని ఎత్తుకుంటుంది. అలాంటి అంశాన్ని హైలెట్ చేయడానికి కేసీఆర్ మీడియా ముందుకు వస్తారు. ఆయన చెబితేనే తెలంగాణ సమాజంలోకి విషయం చొచ్చుకువెళుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. కానీ, బనకచర్ల విషయంలో ఎక్కడా కేసీఆర్ మాట్లాడలేదు. కేటీఆర్ ను ముందు పెట్టి ‘బనకచర్ల’ డ్రామాను రక్తి కట్టించారు.
ప్రభుత్వం కూడా ‘బనకచర్ల’పై బీఆర్ఎస్ దాడితో ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిందని అంటున్నారు. ఇదంతా కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి భావినేతగా కేటీఆర్ ను హైలెట్ చేయడానికే ఆయన వెనక్కి తగ్గారంటున్నారు. నిజానికి ఎన్నికల్లో పార్టీ ఓడిన నుంచి కేసీఆర్ ఎక్కువగా మౌనాన్ని పాటిస్తున్నారు. ఉద్యమ సమయంలో మాట్లాడినట్లు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి అయ్యాక అడపాదడపా మీడియాతో మాట్లాడిన కేసీఆర్, ఇప్పుడు ఎక్కువగా తన కుమారుడు కేటీఆర్ తోనే మాట్లాడిస్తున్నారు.
2023లో ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన తర్వాత ఎర్రవల్లి ఫాం హౌజుకు వెళ్లిన కేసీఆర్.. ఒకటి రెండు సార్లు మాత్రమే రాజకీయ కార్యకలాపాలను నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహణకు బీఆర్ఎస్ భవన్ కు రెండుసార్లు వచ్చిన కేసీఆర్, ఏప్రిల్ లో బీఆర్ఎస్ 25 ఏళ్ల సంబురాలకు మరోసారి వరంగల్ వచ్చారు. అంతేగాని రాజకీయంగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. చివరికి అసెంబ్లీకి కూడా మార్చిలో ఒక రోజు వచ్చి వెళ్లిపోయారు. కానీ, ప్రతి రోజు కేటీఆర్ ద్వారానే బీఆర్ఎస్ ప్రకటనలు ఇప్పిస్తున్నారు. పార్టీకి సర్వం కేటీఆర్ అన్న భావన వ్యాప్తి కలిగేలా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇది గమనించే పార్టీలో తన పాత్రపై క్లారిటీ కోసం కవిత ఆరాటపడుతున్నారని అంటున్నారు. అయితే పార్టీకి ఎవరో ఒకరే సుప్రీం కమాండర్గా ఉంటారని అంటున్నారు. కేసీఆర్ కూడా కేటీఆర్‌కు లైన్ క్లియర్ చేసేందుకు తనతోపాటు మిగిలిన వారిని సైతం వెనక్కి తగ్గిస్తున్నారని చెబుతున్నారు.