కేసీఆర్ వ‌ర్సెస్ జ‌గ‌న్‌..: హాట్ డిబేట్‌

ఇక‌, త‌ర‌చుగా కేసీఆర్-జ‌గ‌న్‌ల మ‌ధ్య పోలిక‌లు పెడుతూ.. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతూ నే ఉంది.;

Update: 2025-08-16 06:46 GMT

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌ల వ్య‌వ‌హారం ఆక‌స్మికంగా తెర‌మీదికి వచ్చింది. సోష‌ల్ మీడియాలో మ‌రోసారి వీరిద్ద‌రూ హాట్ టాపిక్ అయ్యారు. దీనికి కార‌ణం.. స్వాతంత్ర దినోత్స‌వ‌మే. ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి రావాల‌ని.. కేసీఆర్‌, తెలంగాణ‌లో మూడోసారికూడా కేసీఆర్ సీఎం కావాల‌ని జ‌గ‌న్ కోరుకున్న‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఇరువురు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకున్నార‌నే వాద‌న కూడా ప్ర‌త్య‌ర్థి ప‌క్షాల నుంచి వినిపించింది.

ఇక‌, త‌ర‌చుగా కేసీఆర్-జ‌గ‌న్‌ల మ‌ధ్య పోలిక‌లు పెడుతూ.. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతూనే ఉంది. ఏపీలో వెలుగు చూసిన మ‌ద్యం కుంభ‌కోణం, తెలంగాణ‌లో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలు.. ఇరు ప‌క్షాల‌ను రాజకీయంగా చ‌ర్చించుకునేలా చేశాయి. ఇదేస‌మ‌యంలో వ్య‌క్తిగ‌తంగా కూడా ఇరువురు నాయ‌కుల వ్య‌వ‌హార శైలిపై అనేక వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేశాయి. ఇరువురు నాయ‌కులు త‌మ‌కు ఇష్ట‌మైతే.. సొంత పార్టీ నాయ‌కుల‌నైనా చేర‌దీస్తార‌న్న వాద‌న ఉంది.

అంతేకాదు.. త‌మ‌కు న‌చ్చ‌క‌పోతే..ఎంత‌టి వారినైనా త‌క్ష‌ణం ప‌క్క‌న పెట్టేస్తార‌ని కూడా అటు కేసీఆర్‌, ఇటు జ‌గ‌న్‌ల‌పై వాద‌న న‌డుస్తున్న విషయం తెలిసిందే. ఇక‌, అప్పాయింట్‌ మెంటు నుంచి ప‌ద‌వుల వ‌ర‌కు కూడా అన్నీ తాము అనుకున్న‌ట్టే చేస్తార‌ని, ప్రతిప‌క్షం లేకుండా చేసుకోవాల‌ని కూడా ఇరువురు నాయ‌కు లు ప్ర‌య‌త్నించార‌న్న వాద‌న కూడా ఉంది. ఇలా.. ఇరువురికి మ‌ధ్య ప‌లు పోలిక‌లు ఉన్నాయి. తాజాగా స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా కూడా ఇరువురు నాయ‌కులు ఒకే విధంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా ఇరువురు నాయ‌కులు వేడుక‌ల‌కు దూరంగా ఉన్నారు. క‌నీసం వారి వారి పార్టీ కార్యాల‌యాల‌కు కూడా రాలేదు. జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌లేదు. ఇక‌, ఇరు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌లు ఇచ్చిన ఎట్ హోం విందుకు ఆహ్వానాలు అందినా.. అటు కేసీఆర్ కానీ, ఇటు జ‌గ‌న్ కానీ.. రాజ్‌భ‌వ‌న్‌కు మొహం కూడా చూపించ‌లేదు. ఈ ప‌రిణామాల‌ను ఉటంకిస్తూ.. కేసీఆర్ వ‌ర్సెస్ జ‌గ‌న్‌ల‌పై సోష‌ల్ మీడియాలో హాట్ డిబేట్ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఎక్కువ మంది ఈ కామెంట్ల‌కు లైకులు పెట్ట‌డం మ‌రో విశేషం.

Tags:    

Similar News