వీక్ పాయింట్స్ పట్టేశారా... ఒకే టైం లో కేసీఅర్...జగన్

ఇక చూస్తే మరో విషయం ఏంటి అంటే ఏపీలో కూటమి పెద్దలు తాము ఏకంగా పదిహేనేళ్ళ పాటు అధికారంలో ఉంటామని చెబుతున్నారు.;

Update: 2025-12-16 10:30 GMT

తెలుగు నాట రాజకీయాలు ఒకే మాదిరిగా సాగుతున్నాయి. అధికార పక్షం తెలంగాణాలో ఏపీలో బలంగా ఉంది. మంచి జోష్ మీద కూడా ఉంది. ఏపీలో టీడీపీ కూటమి 2024లో అధికారంలోకి వచ్చింది. మూడు ప్రధాన పార్టీలు అయిన తెలుగుదేశం జనసేన బీజేపీ జత కట్టి మరీ అప్పటికి అధికారంలో ఉన్న వైసీపీని ఓడించాయి. ఇక తెలంగాణాలో చూస్తే కనుక 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చిత్రమేంటి అంటే ఇక్కడ పొత్తులు లేవు, సింగిల్ గానే కాంగ్రెస్ పవర్ దక్కించుకుంది. బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా విడిగానే పోటీ చేశాయి. త్రిముఖ పోరు అక్కడ సాగింది. 2028లో తిరిగి ఎన్నికలు ఉన్నాయి. ఆనాటికి ఏ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదురుతాయి అన్నది కూడా తెలియకపోగా మరో ఒకటో రెండో కొత్త పార్టీలు కూడా రంగంలోకి దిగే చాన్స్ ఉంది అని అంటున్నారు

ధీమాతోనే అంతా :

ఇక చూస్తే మరో విషయం ఏంటి అంటే ఏపీలో కూటమి పెద్దలు తాము ఏకంగా పదిహేనేళ్ళ పాటు అధికారంలో ఉంటామని చెబుతున్నారు. ఏపీలో సమగ్రమైన ప్రగతికి అయిదేళ్ళ సమయం చాలదని మరో రెండు టెర్ములు కావాలని కోరుతున్నారు. అలా తామే మళ్ళీ మళ్ళీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణాలో చూస్తే కనుక 2034 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు ప్రకటన చేసి ఉన్నారు. అంతే కాదు తాను మళ్ళీ సీఎం అని ఆయనే ఫుల్ కాన్ఫిడెన్స్ తో ప్రకటిస్తున్నారు.

రంగంలోకి విపక్షం :

ఇలా అధికార పక్షం అక్కడా ఇక్కడా పూర్తి ధీమాతో ముందుకు సాగుతూంటే రెండు చోట్ల విపక్షం తీరు ఇన్నాళ్ళూ కొంత స్తబ్దుగానే సాగింది. ఏపీతో పోలిస్తే తెలంగాణాలో బీఆర్ఎస్ జోరు చేసినా అసలైన నాయకుడు కేసీఆర్ మాత్రం కేరాఫ్ ఫాం హౌస్ గా ఇన్నాళ్ళూ ఉంటూ వచ్చారు. ఆయన చడీ చప్పుడూ రాజకీయంగా అయితే లేదు. ఇక ఏపీలో వైసీపీ క్యాడర్ ద్వారా ఆందోళనలు నిర్వహింపచేస్తూ జగన్ మాత్రం తాను తెర చాటునే ఉంటూ వస్తున్నారు. ఆయన సైతం కేరాఫ్ బెంగళూర్ గానే ఉంటున్నారు. అయితే 2026లోకి అడుగు పెడుతున్న వేళ అటు కేసీఆర్ ఇటు జగన్ రాజకీయ రంగంలోకి తిరిగి ఫుల్ యాక్టివ్ మోడ్ లో దిగబోతున్నారు అని అంటున్నారు. కేసీఆర్ అయితే అటు పార్టీతో ఇటు ఎమ్మెల్యేలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దాంతో భారీ యాక్షన్ ప్లాన్ తో ఆయన తెలంగాణాలోని రేవంత్ రెడ్డి సర్కార్ ని ఢీ కొట్టేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నారు.

జగన్ సైతం :

ఇక ఏపీలో జగన్ కూడా 2026 క్యాలెండర్ ని ఫుల్ గా వాడుకోవాలని చూస్తున్నారు. తన కాల్షీట్లు మొత్తం ఆ ఏడాదంతా ఇచ్చి మరీ జనంలోనే ఉండేలా పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. బస్సు యాత్రతో ముందు ప్రతీ జిల్లాలో క్యాడర్ ని పలుకరిస్తూ ప్రతీ నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసుకుంటూ పార్టీని పటిష్టం చేసే ముమ్మర కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు.

వీక్ నెస్ తోనే :

రాజకీయం ఎపుడూ ప్రత్యర్ధి వీక్ నెస్ ని పట్టుకుంటేనే పండుతుంది. అదను కోసం చూసి బరిలోకి దిగడమే రాజకీయాల్లో అసలైన వ్యూహం. ఆ విధంగా చూస్తే ఇన్నాళ్ళూ సైలెంట్ మోడ్ లో ఉన్న కేసీఆర్ కానీ జగన్ కానీ ఇపుడు ఒక్కసారిగా జనంలోకి రావాలని అనుకోవడం వెనక ఆలోచనలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు అధినేతలు అధికారంలో ఉన్న ప్రభుత్వాల విషయంలో బలహీనతలను పట్టుకున్నారా అన్న డిస్కషన్ సాగుతోంది. అలాగే జనం పల్స్ కూడా తెలుసుకుంటూ తమకు అనుకూలంగా రాజకీయాన్ని తిప్పడానికి ఇదే తగిన సమయంగా భావించి ఫీల్డ్ లోకి దిగబోతున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం పట్ల ప్రజలలో ఎన్నో ఆశలు ఉంటాయి. అవి నెమ్మదిగా కాలంతో పాటుగా కరిగిపోతూ అసంతృప్తులుగా మారుతాయి. సరిగ్గా దానిని అంచనా వేసి ప్రతిపక్షం రంగంలోకి దిగితే పరిస్థితి వారికి సానుకూలం అవుతుంది. మరి రాజకీయ వ్యూహాలలో తమదైన శైలిలో ముందుకు సాగే కేసీఆర్ జగన్ అధికారం పక్షం వీక్ నెస్ ని గుర్తించారా అన్నదే చర్చగా ఉంది మరి.

Tags:    

Similar News