కేసీఅర్ జగన్...కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకోవాల్సిందే !
రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల మధ్య సారూప్యం ఎంతో ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.;
రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల మధ్య సారూప్యం ఎంతో ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి దూకుడు రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ ని గట్టిగా నియంత్రిస్తున్నారు. రెండుసార్లు వరసగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు విపక్షంలో ఉంది. దానికి తోడు ఎన్నడూ లేనంతగా రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ తనదైన ప్రయత్నాలను చేస్తూ వస్తున్నా కూడా గేర్ మార్చలేకపోతోంది. కారుకు జోరు పెంచలేకపోతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.
బయటకు రాని తీరు :
ఇక గులాబీ పార్టీకి బాస్ గా ఉన్న కేసీఆర్ అయితే ఓటమి తరువాత గడచిన రెండేళ్ళుగా బయటకు రావడం లేదు. ఆయన పూర్తిగా ఫాం హౌస్ కే పరిమితం అయ్యారు. ఆ మధ్యన అంటే డిసెంబర్ నెలలో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఇక కొత్త ఏడాది నుంచి జనం మధ్యనే ఉంటాను అని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కానీ నిజానికి అదేమీ జరగలేదు. కేసీఆర్ కేరాఫ్ ఫాం హౌస్ అన్నట్లుగానే కధ సాగుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ ని హరీష్ రావు కేటీఆర్ ఇద్దరూ కలసి నడిపిస్తున్నా కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది మరో వైపు చూస్తే కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ లో కీలకంగా ఉంటూ ఎంపీ ఎమ్మెల్సీగా పనిచేసిన కవిత కొత్త పార్టీ సన్నాహాల్లో ఉన్నారు. ఆ ప్రభావం కూడా బీఆర్ఎస్ మీద తీవ్రంగా పడే అవకాశం ఉంది అని అంటున్నారు.
ఏపీలో వైసీపీ :
ఇక ఏపీలో వైసీపీ తీరు కూడా డిటోగానే ఉంది అని అంటున్నారు. రెండేళ్ళకు దగ్గర పడుతున్నా వైసీపీ గ్రాఫ్ అయితే ఎక్కడా పెరగడం లేదు, మరో వైపు వైసీపీ ఓటమికి గల కారణాలను అన్వేషించి నిజాయతీగా సమీక్ష చేసుకుందా లేదా అన్న చర్చ సాగుతోంది. జగన్ విషయం తీసుకుంటే ఆయన అసెంబ్లీకి దూరంగా తాను ఉండడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా దూరం ఉంచుతున్నారు. అంతే కాకుండా జిల్లా పర్యటనలు కూడా చేయడం లేదు, పాదయాత్ర మీదనే పూర్తి నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఏపీలో వైసీపీకి కూడా షర్మిల రూపంలో ఇబ్బంది ఉంది. ఆమె నేరుగా జగన్ మీద వైసీపీ మీద చేస్తున్న విమర్శలతో ఆ పార్టీ ఇబ్బందుల పాలు అవుతోంది అని అంటున్నారు.
బలమైన స్లొగన్స్ తో :
ఇక అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ కొత్త ఇమేజ్ తోనే జనంలోకి రావాలని అంటున్నారు. జగన్ 2019 కి ముందు ఉన్న ఇమేజ్ అయితే ఇపుడు వర్కౌట్ అవదని అంటున్నారు. ఆనాడు వైఎస్సార్ కుమారుడిగా ఏ విధంగా పాలిస్తారో అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉండేది. అయిదేళ్ల పాలన చూసిన తరువాత జగన్ మీద జనంలో ఉన్న ఇమేజ్ భావన వేరుగా ఉంటుందని అని విశ్లేషిస్తున్నారు. దాంతో ఆయనకు ఈసారి పాదయాత్ర కోసం జనంలోకి వచ్చినా బలమైన స్లోగన్ తో రావాల్సి ఉంటుందని అంటున్నారు
అంతే కాకుండా కొత్త వ్యూహాలతో సరికొత్త యాక్షన్ ప్లాన్ తోనే జనాన్ని ఆకట్టుకోవాల్సి ఉందని గుర్తు చేస్తున్నారు. అటు వైపు చూస్తే కేసీఆర్ విషయం అలాగే ఉంటుందని అంటున్నారు. తెలంగాణాను పోరాడి తెచ్చిన యోధుడిగా రెండు ఎన్నికల్లో జనాలు గెలిపించారు. కానీ 2028 లో జరిగే ఎన్నికల్లో ఆయన పదేళ్ళ పాలన మీద చూస్తారు, దాంతో ఈసారి తాము ఏమి చేయబోతున్నామో చెప్పాలి. అంతే కాకుండా సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.