ప్రజలు-అసెంబ్లీ.. కేసీఆర్ అంతరంగం ఏంటి?
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. అసెంబ్లీకి వచ్చే విషయంపై సంది గ్ధం కొనసాగుతూనే ఉంది.;
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. అసెంబ్లీకి వచ్చే విషయంపై సంది గ్ధం కొనసాగుతూనే ఉంది. ఆయన తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను అసెంబ్లీకి రావట్లేదని అంటున్నారని.. కానీ, తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి.. నేను అసెంబ్లీ పోనన్న ధోరణిలోనే వ్యాఖ్యానించారు.
కానీ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అందరూ శిరసావహించాల్సిందేనన్న కేసీఆర్ గత మాటలను బట్టి.. చూస్తే.. ఇలా వ్యాఖ్యానించడం సరికాదని మేధావులు చెబుతున్నారు. ఇప్పటి వరకు గడిచింది 16 మాసాలేనని.. ఇంకా.. 3 ఏళ్లకుపైగా సభ జరుగుతుందని.. అప్పటి వరకు కేసీఆర్ వెళ్లకుండా ఉంటే.. సరైన సంకేతాలు వెళ్లే అవకాశం లేదని చెబుతున్నారు. సభకు వెళ్లడం ద్వారా కేసీఆర్ తన ఇమేజ్‌ను పెంచుకోవడంతోపాటు.. ప్రజల్లోనూ భరోసా కల్పించే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇక, కేసీఆర్ చేసిన మరో కీలక వ్యాఖ్య.. అధికారం కాంగ్రెస్ కు ఇచ్చి.. పోరాటం తనను చేయాలని కోరమనడం. ఇది ప్రజాస్వామ్య దేశాల్లో కామనే. అధికార పక్షాన్ని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షంపైనే ఉంటుంది. కాబట్టి సహజంగానే ప్రజలు ప్రతిపక్షంవైపు చూస్తారు. కానీ, మాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి.. మీరు మమ్మల్ని కొట్టాడాలని ఎలా ప్రశ్నిస్తారన్న కోణంలో కేసీఆర్ ప్రశ్నించడం సరికాదని అంటున్నారు. అయితే.. మేలి మలుపుగా.. తాను ప్రజల్లోకి వస్తానని మాత్రం ఆయన ముక్తాయించడం బాగానే ఉంది.
కానీ, దీనికి కూడా సమయం, సందర్భం అంటూ.. ఏమీ చెప్పలేదు. దీనిని బట్టి.. వచ్చే రెండేళ్లపాటు.. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికలకు ఏడాదో .. ఏడాదిన్నర ముందో ఆయన ప్రజల మధ్యకు వచ్చే సూచనలే ఆయన ప్రసంగంలో కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నా రు. బలమైన గళం.. ప్రజలను తనవైపు తిప్పుకోగల నేర్పు ఉన్న కేసీఆర్.. అటు అసెంబ్లీ విషయంలోను.. ఇటు ప్రజల విషయంలోనూ.. సమయం పెట్టుకున్నట్టు గా వ్యవహరించడంపై చర్చ సాగుతోంది.