అనుకున్నదే.. కేరళ సీఎంగా అతడి వైపే అధిష్ఠానం మొగ్గు

పదేళ్లుగా కాంగ్రెస్ ఎదురుచూస్తున్న వేళ చేతికి వచ్చింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి.;

Update: 2026-05-11 05:36 GMT

పదేళ్లుగా కాంగ్రెస్ ఎదురుచూస్తున్న వేళ చేతికి వచ్చింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. దేశంలోని చాలా రాష్ట్రాలకు భిన్నంగా కేరళలో ఒక సంప్రదాయం ఉంది. ఒకసారి ఎన్నికల్లో ఒక పార్టీకి అధికారాన్ని ఇస్తే.. తర్వాతి ఎన్నికల్లో అదే పార్టీని విపక్షంలో కూర్చోబెట్టటం రివాజు. అందుకు భిన్నమైన పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో చోటు చేసుకుంది. రోటీన్ కు భిన్నంగా ఐదేళ్ల అధికారానికి బదులుగా పదేళ్లు కమ్యునిస్టుల చేతిలో ఉన్న కేరళ రాష్ట్ర పగ్గాలు ప్రస్తుతం కాంగ్రెస్ నేత్రత్వంలోని యూడీఎఫ్ కూటమి చేతికి వెళ్లటం తెలిసిందే.

ప్రభుత్వాన్ని కొలువు తీర్చేందుకు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికి.. ఎప్పటిలానే సీఎంను డిసైడ్ చేయటంలో కాంగ్రెస్ అధినాయకత్వం కిందా మీదా పడుతోంది. తన మనసులోని మాటను బయటకు చెప్పకుండా.. కేరళ కాంగ్రెస్ నేతల ద్వారా తెప్పించే ప్రయత్నం చేస్తోంది. సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ బరిలో ఉండగా.. ఆయనకు పోటీగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనధికారికంగా ప్రచారం జరిగిన సతీషన్ సైతం కుర్చీని ఆశిస్తున్నారు. వీరిద్దరికి ఏ మాత్రం సంబంధం లేని శశిథరూర్ పేరు సైతం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం జరిగినప్పటికి.. అధిష్ఠానం ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదన్న మాట వినిపిస్తోంది.

ఫలితాలు వెలువడి వారం అవుతున్నా.. ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం తేల్చలేదు. కాంగ్రెస్ సంప్రదాయానికి తగ్గట్లే.. సీఎం రేసులో ఉన్న వారు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న కేసీ వేణుగోపాల్ కామ్ గా ఉంటే.. సతీశన్ మాత్రం పోస్టర్ యుద్ధానికి తెర తీశారు. కేసీ వేణుగోపాల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వేయటం ద్వారా పార్టీలో కలకలాన్ని రేపారు. తనకున్న అవకాశాన్ని ఏదోలా అందిపుచ్చుకోవాలని తపిస్తున్న సతీషన్.. కేసీ వేణుగోపాల్ మీద వ్యతిరేక ప్రచారం తనకు మేలు కలిగిస్తుందని భావించారు.

అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితుల్ని ఆయన ఫేస్ చేయాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల వేణుగోపాల్ కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్ల గురించి సతీశన్ ను రాహుల్ గాంధీ అడిగినట్లే అడిగి.. కడిగేసినట్లుగా సమాచారం. రాహుల్ ఆగ్రహాన్ని అర్థం చేసుకున్న సతీషన్.. తాను చేసిన పనిని రాహుల్ కు చెప్పేశారని చెబుతున్నారు. అదే సమయంలో పార్టీలో తనకున్న హోదాను అడ్డు పెట్టుకొని తన అవకాశాన్ని తగ్గిస్తున్నారన్న ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

కేరళ కాంగ్రెస్ లో సతీషన్ కు.. రమేష్ చెన్నితలకు మంచి పట్టు ఉంది. పినరయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పటంతో పాటు.. వామపక్ష ప్రభుత్వం మీద ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచి పోషించేందుకు బాగానే శ్రమించినట్లుగా చెప్పాలి. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి గుర్తు చేసినట్లు సమాచారం. అయితే.. సతీశన్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తూ.. తమ ప్రాధాన్యత కేసీ అన్న విషయాన్ని రాహుల్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. కేసీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు.

రాబోయే రెండు రోజుల్లో సతీశన్.. రమేష్ లాంటి నేతల్ని బుజ్జగించి.. వారి సంగతి తాము చూసుకుంటామన్న అభయాన్ని ఇవ్వటం ద్వారా కేసీకి సీఎం కుర్చీకి మార్గం సుగమం అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషాల్లో చోటు చేసుకునే అనూహ్య మార్పుల్ని మినహాయిస్తే.. కేసీ వేణుగోపాల్ కేరళ తదుపరి ముఖ్యమంత్రి కావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో ఇప్పటికే యూడీఎఫ్ కూటమి 102 స్థానాల్ని సొంతం చేసుకుంది. అందులో కాంగ్రెస్ సొంతంగా 63 స్థానాల్లో విజయం సాధించటం తెలిసిందే. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కేరళం తదుపరి ముఖ్యమంత్రి గా కేసీ వేణుగోపాల్ అవుతారన్న మాటే బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News