తెలుగు వాళ్లే టార్గెట్.. మన అమ్మాయిలే అస్త్రాలు.. ఢిల్లీ కేంద్రంగా పెట్రేగిపోయిన సైబర్ ముఠా

తెలుగు రాష్ట్రాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని, రుణాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2026-08-12 08:49 GMT

తెలుగు రాష్ట్రాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని, రుణాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా భారీస్థాయిలో కాల్ సెంటర్ నిర్వహిస్తూ ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. బాధితుల ఫిర్యాదుతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీలో కాల్ సెంటర్ ను గుర్తించడమే కాకుండా, అందులో పనిచేస్తున్న 21 మంది తెలుగు యువతులను అరెస్ట్ చేశారని కథనాలు వస్తున్నాయి. ఈ ముఠా గత 18 నెలలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రుణాలు ఇప్పిస్తామని ఆశపెట్టి ఫోన్ ద్వారా అమాయకుల నుంచి డబ్బు కొల్లగొడుతున్న ముఠాలో అసలు సూత్రధారులు ఇంకా దొరకాల్సివుందని పోలీసులు చెబుతున్నారు.

ఢిల్లీ కేంద్రంగా సైబర్ ముఠా అరాచకాలకు పాల్పడుతోందని గుర్తించిన పోలీసులు ఆకస్మిక దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారని చెబుతున్నారు. కాల్ సెంటర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఫోన్ కాల్స్ చేసేవారని, తాము ప్రముఖ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులమని నమ్మబలికి, అతి తక్కువ వడ్డీతోపాటు ఎటువంటి గ్యారెంటీలు లేకుండానే రుణాలు ఇస్తామని ఆశ చూపే వారని పోలీసులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో సులభంగా మమేకం అవ్వడానికి ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే యువతులను టెలీకాలర్లుగా నియమించుకోవడం ద్వారా ఈ ముఠా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని అంటున్నారు.

ఒకసారి బాధితులు వలలో పడిన తర్వాత, నిందితుల అసలు రూపం బయటపడేదని పోలీసులు చెబుతున్నారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ పేరిట బాధితుల నుంచి వేల రూపాయలను ఆన్‌లైన్ ద్వారా వసూలు చేసేవారని, ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసేవారని పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఎవరైనా బాధితులు డబ్బులు చెల్లించిన తర్వాత లోన్ రాలేదని నిలదీస్తే, వారిని బెదిరింపులకు గురిచేసేవారని కూడా చెబుతున్నారు. ఈ ముఠా బాధితులను మానసికంగా ఆర్థికంగా వేధించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

తెలంగాణలో నమోదైన సుమారు 22 సైబర్ క్రైమ్ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి ఈ ముఠా డెన్ ను గుర్తించారని చెబుతున్నారు. ఢిల్లీలోని కాల్ సెంటర్ పై దాడులు నిర్వహించిన అధికారులు, అక్కడ పనిచేస్తున్న 20 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు గల 21 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. సోదాల సమయంలో భారీగా మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్స్‌లు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

అయితే, ఈ మోసాలకు సూత్రధారులైన ప్రధాన నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాల్ సెంటర్ల నిర్వహణ, నిధుల మళ్లింపు వంటి కీలక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అసలైన నేరగాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. ఈ ముఠా సేకరించిన నగదు హవాలా మార్గాల ద్వారా ఎక్కడికి వెళ్తుందనే దానిపై కూడా దర్యాప్తు జరుగుతోందని చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ లో వచ్చే ఆకర్షణీయమైన రుణాల ఆఫర్లను గుడ్డిగా నమ్మవద్దని, ఏదైనా సంస్థ పేరు చెప్పి కాల్స్ వస్తే, ఆ సంస్థ ప్రామాణికతను అధికారిక వెబ్ సైట్ల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు, ఓటీపీలు (OTP), లేదా వ్యక్తిగత డాక్యుమెంట్లు పంపవద్దని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News