పారమౌంట్ - వార్నర్ బ్రదర్స్ విలీన వివాదం!
ఈ వివాదం కారణంగా హాలీవుడ్ స్టూడియోలు .. కార్పొరేట్ దిగ్గజాలు.. ప్రభుత్వ అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది.
హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారీ విలీన ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం రాజకీయ -కార్పొరేట్ వర్గాలలో పెను సంచలనం రేగుతోంది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజాలుగా ఉన్న పారమౌంట్ - వార్నర్ బ్రదర్స్ మధ్య జరగాల్సిన 110 బిలియన్ డాలర్ల భారీ విలీన ఒప్పందానికి కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పారమౌంట్ సంస్థ ఆ రాష్ట్రం నుంచే వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి వేరే ప్రాంతానికి తరలిపోతామని హెచ్చరికలు జారీ చేసింది.
హాలీవుడ్‌కు పుట్టినిల్లుగా, దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న కాలిఫోర్నియాను వీడతామని పారమౌంట్ సంస్థ ప్రకటించడం అమెరికా మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ విలీనం ద్వారా గ్లోబల్ మార్కెట్‌లో తమ ఆధిపత్యాన్ని మరింత చాటుకోవాలని భావిస్తున్న యాజమాన్యానికి, స్థానిక ప్రభుత్వ నిబంధనలు.. యాంటీ-ట్రస్ట్ చట్టాలు అడ్డంకిగా మారాయి. పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడం సరికాదని.. దీనివల్ల వేలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆ సంస్థ వాదిస్తోంది.
పారమౌంట్ సంస్థ చేసిన హెచ్చరికలపై కాలిఫోర్నియా రాష్ట్ర అటార్నీ జనరల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిని స్పష్టమైన బ్లాక్‌మెయిల్ రాజకీయంగా ఆయన అభివర్ణించారు. చట్టపరమైన నిబంధనలను, ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి కార్పొరేట్ సంస్థ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వాలు వ్యవహరించలేవని స్పష్టం చేశారు. మార్కెట్‌లో గుత్తాధిపత్యం ఏర్పడకుండా చూడటమే ప్రభుత్వాల బాధ్యతని ఇలాంటి బెదిరింపులకు ఎలాంటి పరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు.
ఈ వివాదం కారణంగా హాలీవుడ్ స్టూడియోలు .. కార్పొరేట్ దిగ్గజాలు.. ప్రభుత్వ అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. విలీనం పూర్తయితే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సరికొత్త విప్లవం వస్తుందని, అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకోవడానికి ఎంతో అవసరమని పారమౌంట్ వాదనలను సమర్థించేవారు అభి ప్రాయ పడుతున్నారు. మరోవైపు అతిపెద్ద మీడియా కంపెనీలు ఒక్కటవడం వల్ల చిన్న నిర్మాణ సంస్థలు దెబ్బ తింటాయని వినియోగదారులపై ధరల భారం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
110 బిలియన్ డాలర్ల మెగా డీల్ భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా న్యాయస్థానాలు ..ప్రభుత్వ నిబంధనల చుట్టూ తిరుగుతోంది. దశాబ్దాలుగా కాలిఫోర్నియా రాష్ట్రంతో విడదీయరాని బంధం ఉన్న పారమౌంట్ సంస్థ ఒక్క కారణంతో అక్కడి నుంచి మకాం మార్చడం సాధ్యమవుతుందా ? అనేది చూడాలి. ఏది ఏమైనా? హాలీవుడ్ చరిత్ర లోనే అత్యంత వివాదాస్పదమైన వ్యాపార ఒప్పందంగా ఇది రికార్డులకెక్కుతోంది.
అంతిమంగా కార్పొరేట్ ప్రయోజనాలకు - ప్రభుత్వ నిబంధనలకు మధ్య జరుగుతున్న ఈ పోరు హాలీవుడ్ భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పారమౌంట్ హెచ్చరికలు .. ప్రభుత్వ స్టాండ్ మధ్య నడుస్తున్న డ్రామా త్వరలోనే పెద్ద మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది.