క‌విత‌-అమెరికా-క‌విత‌-అమెరికా... 2 టూర్ల మ‌ధ్య అంతా మారిపోయింది

సంద‌ర్భం 1 : అది 2006... తెలంగాణ ఉద్య‌మ సార‌థి, నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... కాంగ్రెస్ నాయ‌కులు కేకే, కాకా, ఎంఎస్ లు విసిరిన స‌వాల్ కు స్పందించి లోక్ స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు;

Update: 2025-09-02 10:40 GMT

సంద‌ర్భం 1 : అది 2006... తెలంగాణ ఉద్య‌మ సార‌థి, నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... కాంగ్రెస్ నాయ‌కులు కేకే, కాకా, ఎంఎస్ లు విసిరిన స‌వాల్ కు స్పందించి లోక్ స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. దీంతో క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. అంతకుముందే కేంద్ర మంత్రి ప‌ద‌వికీ రాజీనామా చేసిన కేసీఆర్ కు ఆ ఉప ఎన్నిక‌లో గెలుపు అత్యంత కీల‌కం. లేదంటే రాజ‌కీయ జీవిత‌మే సందిగ్ధంలో ప‌డుతుంది. ఇలాంటి స‌మ‌యంలో కేసీఆర్ కు అండ‌గా ఉండేందుకు అమెరికా నుంచి వ‌చ్చేశారు కుమార్తె క‌ల్వ‌కుంట్ల‌ క‌విత‌. అక్క‌డి ఉద్యోగం కూడా వ‌దిలేసి కుటుంబంతో స‌హా సొంత దేశానికి వ‌చ్చేశారు.

సంద‌ర్భం 2 : 2006 నుంచి టీ(బీ)ఆర్ఎస్ లో భాగ‌మ‌య్యారు క‌విత‌. సొంతంగా తెలంగాణ జాగృతి పేరిట ఈ ప్రాంత క‌ల్చ‌ర్ ను కాపాడేందుకు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు. రాష్ట్రం వ‌చ్చాక 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగానూ గెలుపొందారు. 2019లో ఓడిపోయినా, ఎమ్మెల్సీ ప‌ద‌వి పొందారు. పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డంపై అయిష్ట‌త‌తో ఉన్నా బ‌య‌ట ప‌డ‌లేదు.

సంద‌ర్భం 3 : 2025 ఏప్రిల్... పెద్ద కుమారుడి గ్రాడ్యుయేషన్ డేకు అమెరికా వెళ్లారు క‌విత‌. ఇదే స‌మ‌యంలో ఆమె త‌న తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో పార్టీ విధానాలను క‌విత ప్ర‌శ్నించ‌డంతో క‌ల‌క‌లం మొద‌లైంది. ఆ త‌ర్వాత అమెరికా నుంచి తిరిగివ‌స్తూ విమానాశ్ర‌యంలో మీడియాతో మాట్లాడారు. త‌న తండ్రి దేవుడ‌ని.. ఆయ‌న‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఇక అప్ప‌టినుంచి అస‌మ్మ‌తి పెంచారే త‌ప్ప త‌గ్గించ‌లేదు. కాళేశ్వ‌రం క‌మిష‌న్ నోటీసులు, బీసీ రిజ‌ర్వేష‌న్ పై సొంత దీక్ష‌లు ఇలా వ‌రుస‌గా ఏదో ఒక అంశంపై త‌న గ‌ళం వినిపించారు. క‌విత‌పై బీఆర్ఎస్ చ‌ర్య‌లు తీసుకుంటుంది అనే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది.

సంద‌ర్భం 4 : 2025 ఆగ‌స్టు చిన్న కుమారుడిని పైచ‌దువులు చ‌దివించేందుకు అమెరికా వెళ్లారు క‌విత‌. స‌రిగ్గా సెప్టెంబ‌రు 1న స్వ‌దేశం తిరిగివ‌చ్చారు. వ‌స్తూవ‌స్తూనే సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టి.. త‌న మేన బావ‌, మాజీ మంత్రి హ‌రీశ్ రావు, పిన్ని కొడుకు, మాజీ ఎంపీ సంతోష్ ల‌పై కాళేశ్వ‌రం విష‌యంలో తీవ్ర స్థాయి ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో క‌విత‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు.

..అలా క‌విత వ్య‌క్తిగ‌త, రాజ‌కీయ‌ జీవితంలో అమెరికా ప‌ర్య‌ట‌న‌లు కీల‌క‌పాత్ర పోషించాయి. దాదాపు 20 ఏళ్ల కింద‌ట తెలంగాణ ఉద్య‌మంలో, పార్టీ ప‌రంగా తండ్రికి తోడ్ప‌డేందుకు అమెరికా నుంచి వ‌చ్చేసిన క‌విత‌.. ఇప్పుడు అదే అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకుని రాగానే పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్ కు గురికావ‌డం విధి విచిత్రం.

Tags:    

Similar News