బీఆర్ఎస్ గురించి మాట్లాడ: తేల్చేసిన కవిత
బీఆర్ ఎస్ పార్టీ నాయకురాలు, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత తాజాగా ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు.;
బీఆర్ ఎస్ పార్టీ నాయకురాలు, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత తాజాగా ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు. బీఆర్ ఎస్ పార్టీ గురించి తాను మాట్లాడబోనని తేల్చి చెప్పారు. ఆదివారం ఆమె.. హైదరాబాద్‌లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన `తెలంగాణ జాగృతి` కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు.. ''రాఖీ పౌర్ణమి నాడు.. మీ సోదరుడు కేటీఆర్ కు రాఖీ ఎందుకు కట్టలేదు?'' అని ప్రశ్నించారు. దీనిపై ఆమె ఆసక్తిగా స్పందించారు.
''మీరు మాట్లాడేందుకు ఇంకేమీ సబ్జెక్టు లేదా? బీఆర్ఎస్ గురించే ఎందుకు మాట్లాడతరు. నేను మాట్లాడ. ఇంకేదైనా సబ్జెక్టుపై మాట్లాడండి.'' అని కవిత సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్ ఇక సాధ్యం అవుతుందో కాదో.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. దీనిపై వారు తూతూ మంత్రంగా ఢిల్లీలో ధర్నాలు చేసి వచ్చారని.. ఎవరి కన్నీళ్లు తుడిచేందుకు ఆ ధర్నా చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక, బీజేపీ పైనా కవిత విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో నేతల మధ్య సఖ్యత లేదన్నారు. రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావును ఎవరూ లెక్క చేయడం లేదన్నారు. ఎవరికి వారే చీఫ్‌లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ కు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చినా.. ఎందుకు స్పందించలేదన్నా రు. దీనిపై బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మిక సంగం గౌరవ అధ్యక్షురాలు తానేనని.. కవిత చెప్పారు. ఎన్నికల్లో ఇతర సంఘాలతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు.