కవిత కొత్త పార్టీ...ముళ్ళు గుచ్చుకునేది అక్కడే !
ఇక కొత్త పార్టీకి తెలంగాణాలో ఏ మేరకు అవకాశాలు ఉన్నాయని చూస్తే కనుక లేవు అని ఎవరూ చెప్పలేరు, అలాగని ఉన్నాయని బల్ల గుద్ది మరీ అనలేరు.;
కవిత కొత్త పార్టీ పెడతాను అని స్పష్టంగానే చెప్పేశారు. రాజకీయాల్లో వారు అసంతృప్తి వచ్చినా లేక అలిగినా పార్టీలు పెట్టడం కొత్త అయితే కాదు, గతంలో చాలా మంది పెట్టారు. ఆయా పార్టీ వల్ల ఏ మేరకు ఇతర పార్టీలకు ఇబ్బంది కలిగింది అన్నది చరిత్రలో అంతా చూసారు. చిత్రమేంటి అంటే అసంతృప్తితో పార్టీలు పెట్టిన వారిలో ఎవరూ నెగ్గలేకపోయారు. తాము ఏదో సమాజానికి సేవ చేద్దామని ఒక గట్టి లక్ష్యాన్ని పెట్టుకుని పార్టీలు పెట్టిన వారికే జనాలు జై కొట్టారు. విషయం ఇలా ఉంటే తెలంగాణాలో కొత్త పార్టీకి రంగం అయితే సిద్ధం అయినట్టే. ఆ రాష్ట్రంలో మరో రెండున్నరేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఇది చాలా కీలక సమయం. కొత్త పార్టీని పెట్టి ఇప్పటి నుంచి జనం మధ్యలోకి తేకపోతే మాత్రం ప్రభావం ఏ మాత్రం చూపించడం కష్టమన్న ఆలోచనతో కవిత ఉన్నారు అని అంటున్నారు. అందుకే ఆమె 2026 కొత్త ఏడాది వస్తూనే తన పార్టీ ప్రకటన గురించి స్పష్టం చేశారు.
వీరి మద్దతుతోనే :
ఇక కవిత కొత్త పార్టీ యువత బడుగులు అణగారిన వర్గాలు అలాగే తెలంగాణా కోసం ఉద్యమించిన వారు, అమర వీరుల బంధువులు కుటుంబాలు మైనారిటీలు వీరందరికీ ఒక బలమైన రాజకీయ వేదికగా తన పార్టీ ముందుకు వస్తుందని ఆమె ప్రకటిస్తున్నారు. కవిత కొత్త పార్టీ ప్రకటన ఎవరికీ ఆశ్చర్యం అయితే కాదు, ఎందుకంటే గత ఏడాది మధ్యలో నుంచే ఆమె బీఆర్ఎస్ తో విభేదిస్తున్నారు. ఆ తరువాత ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అది లగాయితూ ఆమె తన సొంత రాజకీయం చేయాలని చూస్తూ వస్తున్నారు. తెలంగాణాలో ఆమె పర్యటనలు కూడా చేస్తున్నారు. దాంతో ఆమె ఒక మంచి సమయం కోసమే చూస్తున్నారు అని అంతా అనుకుంటున్నారు.
రాజకీయ శూన్యత :
ఇక కొత్త పార్టీకి తెలంగాణాలో ఏ మేరకు అవకాశాలు ఉన్నాయని చూస్తే కనుక లేవు అని ఎవరూ చెప్పలేరు, అలాగని ఉన్నాయని బల్ల గుద్ది మరీ అనలేరు. అయినా ఎపుడూ రాజకీయాలే కాదు ఎక్కడైనా అవకాశాలను అందుకోవడమే ఎవరైనా చేయాల్సిన పని. ఆ విధంగా చూస్తే పార్టీ పెట్టే వారి సత్తా మీదనే అంతా ఆధారపడి ఉంటుంది, మరి కవిత చూస్తే తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని అలాగే విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీలను సవాల్ చేసి మరీ కొత్తగా పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ ని క్రియేట్ చేసే విధంగా పార్టీ నిర్మాణం చేయగలరా అన్నదే చర్చ. అలాగే కవిత పార్టీ పెట్టడం వల్ల ఎవరికి లాభం అన్నది మరో చర్చగా ముందుకు వస్తోంది.
బీఆర్ఎస్ కేనా :
ఇక కవిత కొత్త ఆర్టీ పెట్టడం ద్వారా తెలంగాణా రాజకీయాలలో ఏ విధమైన పరిణామాలు సంభవిస్తాయో ఎవరూ చెప్పలేరు కానీ బీఆర్ఎస్ లో మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని గట్టిగా చెప్పగలరు, ఎందుకంటే తాను అన్ని బంధాలు తెంపుకున్నాను అని ఆమె చెబుతున్నా కవిత ఈ రోజుకీ కేసీఆర్ కుమార్తెగానే జనం చూస్తారు, అంతే కాదు ఆమె బీఆర్ ఎస్ మీద ఎక్కుపెట్టే ప్రతీ విమర్శకు ఆ పార్టీయే ఇరకాటంలో పడుతుంది. అలాగే బీఆర్ఎస్ లో ఇమడలేని వారు అలాగే ఆ పార్టీ మీద కోపం ఉన్న వారు ఎంతో కొంత మద్దతు తెలిపినా కూడా అది కవిత పార్టీకి ఇంధనంగానే ఉంటుంది.
చీల్చే ఓట్లు కానీ :
వెరసి ఆమె చీల్చే ఓట్లు కానీ లేదా ఆమె పార్టీ వల్ల పడే ప్రభావం కానీ కచ్చితంగా గులాబీ పార్టీ మీదనే పడతాయని అంటున్నారు. అంటే ముళ్ళు గుచ్చుకునేది గులాబీ పార్టీకే అని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ మీద విమర్శలు చేసినా ఎంతగా జనాల్లోకి ఎక్కుతాయో తెలియదు కానీ బీఆర్ ఎస్ మీద విమర్శలు అయితే జనాలకు బాగానే రికార్డు అవుతాయి, కారణం ముందే చెప్పినట్లుగా ఆమె బీఆర్ఎస్ తో కలసి ప్రయాణించారు, పైగా ఆ ఇంటి ఆడబిడ్డ కాబట్టి. సో కవిత కొత్త పార్టీ అంటే అది బీఆర్ఎస్ కే ఎంతో కొంత నష్టం చేకూరుస్తుంది అన్నది ఇప్పటికి అయితే ఉన్న విశ్లేషణ.