మోడీ తనపై అసంతృప్తిగా ఉన్నారు.. ట్రంప్ హాట్ కామెంట్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్, అమెరికా సంబంధాల్లో మరోసారి చర్చకు దారి తీశాయి.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్, అమెరికా సంబంధాల్లో మరోసారి చర్చకు దారి తీశాయి. టారిఫ్‌ల అంశం కారణంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తనపై “అంతగా సంతోషంగా లేరని” ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే అమెరికా తయారీ అపాచీ హెలికాప్టర్ల సరఫరా ఆలస్యం అంశాన్ని మోడీ నేరుగా తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
హౌస్ జీ.వో.పీ మెంబర్ రిట్రీట్‌లో ప్రసంగించిన ట్రంప్ భారత్ చాలా ఏళ్ల క్రితమే ఆర్డర్ చేసిన అపాచీ హెలికాప్టర్లు ఇంకా అందలేదని, ఆయుధాల తయారీ, డెలివరీ ప్రక్రియలు అనవసరంగా ఆలస్యం అవుతున్నాయని అన్నారు. “భారత్ 68 అపాచీ హెలికాప్టర్లు ఆర్డర్ చేసింది. మోడీ స్వయంగా వచ్చి ఈ విషయాన్ని చెప్పారు. ఆయనతో నాకు మంచి సంబంధమే ఉంది” అని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే వాణిజ్య విధానాల విషయంలో మాత్రం ఉద్రిక్తత ఉందని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ పరిపాలన విధించిన అధిక సుంకాల వల్ల భారత్ నుంచి దిగుమతులపై 50 శాతం టారిఫ్ అమలులో ఉందని దీని కారణంగానే మోడీ అసంతృప్తిగా ఉన్నారని ట్రంప్ అన్నారు. టారిఫ్‌లను ఆర్థిక భద్రత, జాతీయ భద్రతకు కీలక ఆయుధంగా ఆయన సమర్థించుకున్నారు. వాటి ద్వారా అమెరికాకు భారీ ఆదాయం వచ్చిందని ఇతర దేశాల నుంచి రాయితీలు సాధ్యమయ్యాయని చెప్పారు.
భారత్–అమెరికా రక్షణ భాగస్వామ్యం
గత దశాబ్దంలో అమెరికా రక్షణ పరికరాలను అత్యధికంగా కొనుగోలు చేసిన దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ట్రాన్స్‌పోర్ట్ విమానాలు, నిఘా వ్యవస్థలు, అపాచీ హెలికాప్టర్లు వంటి కీలక ఆయుధ వ్యవస్థలు భారత్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఆధునీకరణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరఫరా ఆలస్యం అంశాన్ని ట్రంప్ అమెరికా రక్షణ కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచేందుకు ఉదాహరణగా వినియోగించారు.
వెనిజులా చర్యలపై ఇయాన్ బ్రెమ్మర్ వ్యాఖ్యలు
ఈ పరిణామాల మధ్య జియోపాలిటిక్స్ నిపుణుడు ఇయాన్ బెర్మర్ ట్రంప్ విదేశాంగ విధానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెనిజులాపై ట్రంప్ పరిపాలన తీసుకున్న సైనిక చర్యలు తాత్కాలికంగా ట్రంప్‌ను బలమైన నేతగా చూపించవచ్చని, కానీ దీర్ఘకాలంలో అవి కొనసాగడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికాలో ప్రతి నాలుగేళ్లకోసారి నాయకత్వం మారే ప్రజాస్వామ్య వ్యవస్థ వల్ల విధానాల్లో స్థిరత్వం ఉండదని బ్రెమ్మర్ అన్నారు. చైనా, రష్యా, భారత్ వంటి దేశాల్లో నాయకత్వానికి స్థిరత్వం ఉండగా అమెరికాలో అది కొరవడిందని వ్యాఖ్యానించారు. “ఇది చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కాదు.. పదేళ్లుగా దేశాన్ని నడుపుతున్న మోడీ కూడా కాదు. ఇది ప్రజాదరణ తక్కువగా ఉన్న ట్రంప్ పాలన” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వెనిజులా చమురు.. వాస్తవాలు
వెనిజులా ప్రస్తుతం రోజుకు సుమారు 8 లక్షల బ్యారెళ్ల చమురు మాత్రమే ఉత్పత్తి చేస్తోందని, ఒకప్పుడు అది 30 లక్షల బ్యారెళ్లకు పైగా ఉండేదని బ్రెమ్మర్ గుర్తు చేశారు. చమురు ఉత్పత్తి పెరగాలంటే రాజకీయ స్థిరత్వం, పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించే వాతావరణం అవసరమని అన్నారు. అధ్యక్షుడి పదవీకాలం కన్నా చమురు కంపెనీల పెట్టుబడి నిర్ణయాలు చాలా దీర్ఘకాలికమైనవని స్పష్టం చేశారు.
తాత్కాలిక ప్రభావమా? దీర్ఘకాల ప్రయోజనమా?
ట్రంప్ టారిఫ్ విధానాలు, వెనిజులాపై సైనిక చర్యలు ప్రపంచ రాజకీయాల్లో తాత్కాలిక ప్రభావం చూపుతున్నప్పటికీ అవి దీర్ఘకాలంలో నిలిచేనా అనే సందేహాలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్‌తో ఉన్న రక్షణ భాగస్వామ్యం బలంగా కొనసాగుతున్నా, వాణిజ్య అంశాల్లోని టెన్షన్ రెండు దేశాల సంబంధాల్లో కొత్త సవాళ్లను తెస్తోంది.