అమెరికాలో నిఖిత హత్య కేసు : ఇండియాలో నిందితుడు అర్జున్ అరెస్ట్ కాలేదా?

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నికితా గోదిశాల దారుణ హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.;

Update: 2026-01-07 12:30 GMT

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నికితా గోదిశాల దారుణ హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ శర్మ భారత్‌లో అరెస్టయ్యాడంటూ గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో, కొన్ని వార్తా సంస్థల్లో వస్తున్న కథనాలపై నికితా కుటుంబ సభ్యులు స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు స్పష్టం చేశారు.

నిందితుడు అర్జున్ శర్మను భారత పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారాన్ని నికితా తండ్రి అనంద్ గోదిశాల తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఖండించారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర పోలీసు అధికారులు.. చట్ట అమలు సంస్థలతో తాము నిరంతరం టచ్‌లో ఉన్నామని.. నిందితుడు ఇంకా పట్టుబడలేదని వారు స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసి తమ బాధను మరింత పెంచవద్దని వారు మీడియాను కోరారు.

అసలేం జరిగింది?

అమెరికాలోని కొలంబియాలో నివసిస్తున్న 27 ఏళ్ల నిఖిత గోదిశాల హత్యోదంతం అత్యంత విషాదకరంగా మారింది. మేరీల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసి.. డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా రాణిస్తున్న నిఖిత కెరీర్ డిసెంబర్ 31న తన స్నేహితుడు అర్జున్ శర్మ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె ఆచూకీ లభించలేదు. జనవరి 2న స్వయంగా అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసి నిఖిత కనిపించడం లేదని నమ్మబలికాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ శర్మ తెలివిగా భారత్‌కు పారిపోయాడని సమాచారం. అనుమానం వచ్చిన పోలీసులు అర్జున్ నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేయగా నిఖిత మృతదేహం అనేక కత్తిపోట్లతో లభ్యమైంది. ప్రస్తుతం హోవార్డ్ కౌంటీ పోలీసులు అర్జున్‌పై మర్డర్ కేసులు నమోదు చేశారు. అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు భారత అధికారులతో కలిసి నిందితుడి కోసం గాలిస్తున్నాయి. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ఈ కేసును నిశితంగా పరిశీలిస్తోంది. అర్జున్ పై ప్రస్తుతం అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చే ప్రయత్నాలు

నికితా భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెరికాలోని భారత ఎంబసీ మరియు కాన్సులర్ అధికారులతో కుటుంబ సభ్యులు సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా అధికారులు ప్రక్రియ పూర్తి చేయడానికి మరో 3 నుంచి 4 రోజుల సమయం పడుతుందని తెలిపినట్లు నికితా తండ్రి వెల్లడించారు. బిజెపి నేత ఎన్. రామచందర్ రావు నికితా కుటుంబాన్ని పరామర్శించి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు లేఖ రాశారు. నిందితుడిని పట్టుకోవడంలో మృతదేహాన్ని త్వరగా భారత్‌కు చేర్చడంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

నిందితుడు అర్జున్ శర్మ కోసం అటు అమెరికా పోలీసులు.. ఇటు భారత దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి. అధికారికంగా అరెస్ట్ ఖరారు అయ్యే వరకు పుకార్లను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News