కవిత కొత్త పార్టీపై మండ‌లి చైర్మ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు.. తాజాగా ఎమ్మెల్సీ ప‌ద‌విని కూడా వ‌దులుకున్న కవిత‌.. కొత్త‌గా రాజకీయ పార్టీని ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-01-07 12:30 GMT

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు.. తాజాగా ఎమ్మెల్సీ ప‌ద‌విని కూడా వ‌దులుకున్న కవిత‌.. కొత్త‌గా రాజకీయ పార్టీని ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఉద్య‌మ సంస్థ తెలంగాణ జాగృతినే ఆమె రాజ‌కీయ పార్టీగా ప్రారంభించ‌నుంది. ఈ విష‌యాన్ని శాస‌న మండ‌లిలో సోమ‌వారం ఆమె ప్ర‌క‌టించారు. తెలంగాణ జాగృతి పార్టీ (టీజేపీ)ని ప్రారంభించ‌నున్న‌ట్టు క‌విత తెలిపారు.

కాగా.. ఈ వ్య‌వ‌హారంపై శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అవ‌స‌రం లేద‌ని అన్నారు. ఒక‌వేళ ఎవ‌రైనా కొత్త పార్టీ పెట్టినప్ప‌టికీ.. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ విష‌యం లో పున‌రాలోచ‌న చేసుకోవాల‌ని పేర్కొన్నారు. అనేక మంది పార్టీలు పెట్టిన విష‌యాన్ని ఆయ‌న ఈ సందర్భంగా ప్ర‌స్తావించారు. ''గ‌తంలో ఎన్నో పార్టీలు పుట్టాయి. అవి ఏమ‌య్యాయి?'' అని గుత్తా ప్ర‌శ్నించారు.

ఇదే త‌ర‌హాలో క‌విత పార్టీ కూడా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని గుత్తా అంచ‌నా వేశారు. అలాగ‌ని తానేమీ ఆమెను నిరుత్సాహ‌ప‌ర‌చ‌బోన‌ని చెప్పారు. ఎవ‌రి ఇష్టం వారిద‌ని..ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రైనా పార్టీలు పెట్టుకునే స్వేచ్ఛ ఉంద‌ని గుత్తా వ్యాఖ్యానించారు. ఇక‌, క‌విత ప‌దే ప‌దే కోరినందుకే.. తాను ఆమె రాజీనామాను ఆమోదించిన‌ట్టు తెలిపారు.

''ఎవ‌రైనా భావోద్వేగంలో రాజీనామా చేస్తారు. వారికి కొంత స‌మ‌యం ఇస్తే.. స‌ర్దుబాటు చేసుకుంటారు. అందుకే వేచి చూశాను. అంతుకు మించి ఈ విష‌యంలో ఎవ‌రి ఒత్తిడీ లేదు. చివ‌ర‌కు ఆమె కోరుకున్నట్టుగానే రాజీనామాను ఆమోదించా.'' అని గుత్తా తెలిపారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం బాగోలేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఉన్న పార్టీలే అస్తిత్వం కాపాడుకునేందుకు ప్ర‌యాస ప‌డుతున్నాయంటూ.. ప‌రోక్షంగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఆయ‌న చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News