చూస్తూ ఉండండి.. సిరిసిల్ల ఖాళీ అవుతుంది: కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత.. తాజాగా తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతి నిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.;
తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత.. తాజాగా తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతి నిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''చూస్తూ.. ఉండండి.. సిరిసిల్ల ఖాళీ అవుతుంది.'' అని ఆమె వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం గురించి.. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన జగిత్యాల సభ గురించి స్పందించారు.
ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నామని కవిత చెప్పారు. ఇది పార్టీ కాదని.. కొత్త రాజకీయ శక్తి అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఆవిర్భావ సదస్సుకు.. రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రెండు నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చే లా ఏర్పాట్లు చేస్తున్నట్టుతెలిపారు. ఇప్పటికే సిరిసిల్ల(కేటీఆర్ నియోజకవర్గం) నుంచి పాదయాత్ర గా వేలాది మంది యువత, నాయకులు పార్టీ ఆవిర్భవ కార్యక్రమనికి వస్తున్నారని చెప్పారు.
కొత్త రాజకీయ పరిణామం జరుగబోతోంది కాబట్టి.. పబ్లిసిటీ మెటీరియల్ ను తీసేయొద్దని.. హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఫ్లెక్సీలు, బ్యానర్లను కార్యక్రమం అనంతరం.. తామే తొలగిస్తామన్నారు. పార్టీ ఆవిర్భావంతో కొన్ని పార్టీల్లో దడ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. అయితే.. ఏ పార్టీ అనేది చెప్పలేదు. ఇక, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోం దని తెలిపారు. వీటిని తాము ప్రజల మధ్యే ఎండగడతామని పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు కవిత చెప్పారు. ప్రస్తుత ప్రభు త్వం ఆర్టీసీని ప్రవేట్ పరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. అదేసమయంలో రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే దిక్కులేదని ఆరోపించారు. గుంట నక్క(హరీష్) డిల్లీ వెళ్లీ వెళ్లి.. డీల్ కుదుర్చుకునే పనిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
కురువృద్ధుడు ఏం చేస్తాడు?
కాగా.. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ ఎస్‌లో చేరడంపైనా కవిత స్పందించారు. ఒకప్పుడు తెలంగాణ వద్దన్న `కాంగ్రెస్ రెడ్డి`ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు.. ఆయన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. 75 ఏళ్ల కురువృద్ధుడు ఇప్పుడు ఏం చేస్తాడని ప్రశ్నించారు. ``నిన్న బిఆర్ఎస్ సభలో ప్రజల సమస్యలపై ప్రస్తావించకుండా ఉత్త కథలు చెప్పారు. బిఆర్ఎస్ సభలో కేంద్ర ప్రభుత్వన్ని పన్నెత్తు మాట కూడా అనలేదు. ఆ పార్టీ లో మహిళలకు గౌరవం ఎలాగూ లేదు.`` అని విమర్శించారు.