బీఆర్ఎస్‌లో కవిత కల్లోలమా.. సల్లాపమా?!
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ భగ్గున మం డింది.;
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ భగ్గున మండింది. తీవ్ర వివాదంగా మారి.. పతాక శీర్షికలకు ఎక్కింది. ఎవరూ ఊహించని విధంగా ఆమె రాసిన లేఖ రాజకీయ వర్గాల్లోనే కాదు.. కుటుంబంలోనూ కల్లోలం రేపిందన్న చర్చ తెరమీదికి వచ్చింది. ఇక, నిన్నటి వరకుకలిసి ఉండి.. ఇప్పటికిప్పుడు కవిత యూటర్న్ తీసుకున్నట్టు వ్యవహరించడంతో ఏదో జరుగుతోం దన్న చర్చ కూడా జరిగింది.
కానీ.. ఈ కల్లోలం వెనుక సల్లాపం(సానుకూల దృక్ఫధం) ఉందన్న మరో కోణం కూడా వినిపిస్తోంది. తనను తాను ప్రొజెక్టు చేసుకోవడంతోపాటు.. పార్టీలో తన గుర్తింపును గుర్తించేలా పార్టీ అధినేతకు తాను గుర్తు చే యడంలో భాగంగానే కవిత ఇలా లేఖాస్త్రం సంధించారన్న వాదన కూడా వినిపిస్తోంది. నిజానికి కేసీఆర్‌కు కవిత సంధించిన ప్రశ్నలు.. కొత్తవి కాదు. పెద్ద సంచలనం కూడా కాదు. ఈ ప్రశ్నలు గత కొన్నాళ్లుగా పార్టీలో నాయకుల నుంచే వినిపిస్తున్నాయి.
బీజేపీతో తెరచాటు స్నేహం.. ఉద్యమ కారులను దూరం పెట్టడం.. కేవలం తాను మాత్రమే ప్రొజెక్టు కావడం వంటివి ఆది నుంచికూడా.. పార్టీలో చర్చకు వచ్చారు. కోదండరాం వంటి వ్యక్తులను పార్టీ నుంచి బయటకు పంపించినప్పుడే ఉద్యమకారులకు-కేసీఆర్‌కు మధ్య వివాదం రేగింది. ఆ తర్వాతకూడా.. పార్టీలో గుర్తింపు సమస్య తెరమీదికి వచ్చింది. తమకు ఎలాంటి ప్రాధాన్యం లేదని భావించే ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటివారు బయటకు వచ్చారు.
సో.. ఇప్పుడు కవిత సంధించిన ప్రశ్నలు కొత్తవి కాకపోయినా.. కుటుంబ సభ్యురాలిగా ఆమె ప్రశ్నించడం ఒక్కటే సంచలనం. అయితే.. దీనివెనుక 3 కారణాలు ఉన్నాయన్నది పరిశీలకుల అంచనా. 1) రేపు తన అన్న కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. తన పరిస్థితి ఏంటన్నది కవిత ఆలోచన. 2) పార్టీలో తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం వెనుక కుటుంబ నేతలే ఉన్నారని.. ఆమె భావన. ఈ క్రమంలో వారికి అడ్డుకట్ట వేసి.. తాను ఎప్పుడు ఎలాగైనా విజృంభించగలనన్న సంకేతాలు ఇవ్వడం.
3) కేసీఆర్‌నే ప్రశ్నించడం ద్వారా.. పార్టీలో ఉన్న అసమ్మతి నేతలను మచ్చిక చేసుకుని.. వారు గడప దాటకుండా చూసుకునే వ్యూహం. ఈ మూడు కారణాలతోనే కేసీఆర్‌కు కవిత లేఖ సంధించారని.. ఇది కల్లోలం కాదని.. సల్లాపం కోసమే.. చేస్తున్నారన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.