డాడీతోనే ఢీ.. కవిత డిసైడ్ అయినట్లే..!!
తెలంగాణ జాగృతి నేత, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలన్న ఆలోచనకు వచ్చారా? అన్న చర్చ జరుగుతోంది.;
తెలంగాణ జాగృతి నేత, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలన్న ఆలోచనకు వచ్చారా? అన్న చర్చ జరుగుతోంది. వచ్చేనెల 8న కరీంనగర్ కేంద్రంగా పార్టీ తరఫున భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుండగా, అంతకు ముందే ఆమె 72 గంటల దీక్షకు సన్నద్ధం కావడం ఈ అనుమానాలకు కారణంగా చెబుతున్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆమె 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఇంతవరకు అన్న కేటీఆర్ తోనే యుద్ధం చేస్తున్నట్లు చెబుతున్న కవిత.. ఇక తండ్రి కేసీఆరునూ ఢీకొట్టినట్లే అంటున్నారు పరిశీలకులు.
బీఆర్ఎస్ సభకు పోటీగా కవిత నిరాహారదీక్ష
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ఆగస్టు 8న కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఆ తర్వాత ఇదే అంశంపై రాష్ట్రపతిని కలుస్తామని ఆ పార్టీ వెల్లడించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభకు వస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. వరంగల్ లో నిర్వహించిన 25 ఏళ్ల సంబరం తర్వాత పార్టీ తరఫున భారీ కార్యక్రమానికి కరంనగర్ వేదిక కాబోతోంది. దీనికి కేసీఆర్ కూడా వస్తారని చెబుతుండటంతో సభ విజయవంతం చేయడం గులాబీ పార్టీ నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అయితే బీఆర్ఎస్ బీసీ సభకు ముందుగా మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని కవిత ప్రకటించడంతో బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడ్డారు.
తండ్రిని ధిక్కరించడమేనా..?
ఇది అధినేత కేసీఆర్ ను ధిక్కరించడమే అంటున్నారు. ఏ కారణం చూపి బీఆర్ఎస్ సభ నిర్వహిస్తుందో.. అదే కారణం చూపుతూ కవిత నిరాహార దీక్షచేయడమంటే పార్టీ నిర్ణయాన్ని కాదని తన సొంత అజెండా అమలు చేయమే అంటున్నారు. పార్టీ నాయకత్వం కావాలని కోరుకుంటున్న కవిత.. అన్నను వ్యతిరేకిస్తూ ఏదైనా కార్యక్రమం చేస్తానంటే ఆయనతో పోటీ పడుతున్నట్లు భావించవచ్చని, కానీ కరీంనగర్ సభకు తండ్రి వస్తారని చెబుతున్నా, పోటీ కార్యక్రమం ప్రకటించడమంటే అధినేతను వ్యతిరేకించినట్లేనని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.
దేనికైనా రెడీ అన్న సంకేతాలు
అయితే తండ్రి హాజరవుతున్న కార్యక్రమం కాదని కవిత సొంతంగా నిరాహారదీక్ష చేయడం ద్వారా తాను దేనికైనా రెడీ అన్న సంకేతాలు పంపడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంతంగా పార్టీ పెట్టాలని భావిస్తున్న కవిత.. తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను ఆకర్షించేలా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే మంత్రివర్గం ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయిస్తే, వేడుక చేసుకుని కాంగ్రెస్ కు క్రెడిట్ దక్కకుండా చేయాలని కవిత ప్లాన్ చేశారని అంటున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ బీసీ నినాదం ఎత్తకుండా నిలువరించేందుకు బీసీ బ్రాండ్ కోసం కవిత ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పార్టీ నుంచి వేటు పడే వరకు అధిష్టానానికి చికాకు తెప్పించే కార్యక్రమాలకు కవిత ప్లాన్ చేస్తున్నట్లు సందేహిస్తున్నారు.