బలం చూపేందుకు అభిమానుల్ని విజయ్ బలిపెట్టారా?

పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో విజయ్ పేరు మినహాయ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సీ ఎన్ ఆనంద్.. సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ పేర్లు కూడా ఉన్నాయి.;

Update: 2025-09-30 07:48 GMT

కరూర్ లో ప్రముఖ సినీ నటుడు.. టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రచార సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మరణించటం.. పలువురు గాయాల బారిన పడి మ్రత్యువుతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఉదంతానికి బాధ్యలుగా పేర్కొంటూ టీవీకే పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మథియాళన్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఆయనతో సహా పలువురిపై హత్యాయత్నం.. ప్రజాభద్రతకు ముప్పు కలిగించటంలాంటి పలు సెక్షన్ల కింద కేసులునమోదు చేశారు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో విజయ్ పేరు మినహాయ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సీ ఎన్ ఆనంద్.. సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ పేర్లు కూడా ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా బలప్రదర్శన కారణం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొనటం గమనార్హం. దీనికి వారుచూపిన కారణాల్ని చూస్తే..

- ఉదయం 11 గంటలకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు.

- షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం అభిమానుల్ని ఉద్దేశించి విజయ్ ప్రసంగించాల్సి ఉంది

- అలాంటిది రాత్రి 7 గంటలకు సభా స్థలి వద్దకు చేరుకున్నారు.

- భారీ జనసందోహాన్ని చూపించేందుకే ఉద్దేశపూర్వకంగా విజయ్ ఆలస్యంగా వచ్చారు

- విజయ్ రాక కోసం ఎండలో గంటల తరబడి నిల్చున్న అభిమానులు అలిసిపోయారు. దీనికి తోడు గంటల సమయం గడిచే కొద్దీ అభిమానుల సంఖ్య అంతకంతకూ ఎక్కువైపోయిందని పేర్కొన్నారు. అంతేకాదు.. విజయ్ రాకకు ఆలస్యం కావటానికి కారణం.. ఆయన తన షెడ్యూల్ కు భిన్నంగా ఆయన ప్రయాణిస్తున్న బస్సు చాలాచోట్ల ఆగింది.దీంతో.. ఆయన రాక చాలా ఆలస్యమైంది.

సభా స్థలి వద్ద అభిమానులకు మంచినీళ్లు.. ఆహారం లాంటి ఏర్పాట్లు చేయకపోవటం..ఈ విషయాన్ని ప్రస్తావించినా పట్టించుకోకపోవటం కూడా ఈ విషాదానికి కారణంగా చెబుతున్నారు. బల ప్రదర్శన కోసమే విజయ్ ఆలస్యంగా వచ్చారా? ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాలు ఎంతవరకు నిజం? అన్నది చూస్తే.. ప్రముఖులు ఎవరైనా సరే తాము ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సభ వద్దకు ఆలస్యంగా చేరుకోవటం చూస్తున్నదే.

దీనికి తోడు విజయ్ ప్రయాణిస్తున్న బస్సు అందరికి అవగాహన ఉండటం.. ఆయన రాక సందర్భంగా మార్గమధ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు ఆయన కోసం వెయిట్ చేస్తూ..ఆయనకు స్వాగతం పలకటం.. ఈ సందర్భంగా గంటల కొద్దీ ఆలస్యం కావటం తెలిసిందే. ఇలాంటి పరిస్థితి ఒక్క విజయ్ కు మాత్రమే కాదు.. ప్రజల్లో పలుకుబడి ఉన్న చాలామంది విషయంలోనూ ఇలాంటి విషాదాలే జరిగాయి.

పోలీసులు పేర్కొన్నట్లుగా తన బలాన్నితమిళనాడు మొత్తానికి చూపించేందుకు విజయ్ వ్యవహరించిన తీరే ఇంత భారీ విషాదానికి కారణమన్న పోలీసుల అభియోగం నూటికి నూరు శాతం నిజమని చెప్పలేం. అలా అని విజయ్ అండ్ కో ఎలాంటి తప్పు చేయలేదని సర్టిఫై చేయలేం. కాకుంటే తనను అభిమానించి.. ఆరాధించే వేలాది మందికి కష్టం కలగకుండా..వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుడా మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉంటే మరింత బాగుండేదని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News