విజయ్ పార్టీనే పవర్‌ కట్‌ చేయమని కోరిందా?.. సమాధానం ఇదే!

ఈ సందర్భంగా... సెప్టెంబర్ 27 రాత్రి ఈ-రోడ్డులోని వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేస్తూ.. టీవీకే నుండి లేఖ అందిందని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.;

Update: 2025-09-29 21:30 GMT

తమిళనాడులోని కరూర్‌ జిల్లాలో టీవీకే అధినేత విజయ్‌ ప్రచార ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 40 కి చేరగా సుమారు 80 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు! అయితే... దీనిలో కుట్ర కోణం ఉందని టీవీకే ఆరోపిస్తోంది. తమ నేత విజయ్ ర్యాలీ వేదికకు చేరుకున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేశారని పేర్కొంది.

దీంతో అభిమానులు ఆయనను చూసేందుకు ముందుకు కదిలారని, ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో... తొక్కిసలాటకు ముందు కొంతసేపు కరెంటు సరఫరా నిలిచిపోయినట్లు పలువురు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో తమిళనాడు విద్యుత్తు బోర్డు స్పందించింది. కీలక ప్రకటన చేసింది.

అవును... టీవీకే ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరగడం వెనుక కుట్ర కోణం ఉందని, విజయ్‌ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలపై తమిళనాడు విద్యుత్తు బోర్డు స్పందించింది. విజయ్‌ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని టీవీకేనే తమకు వినతిపత్రం ఇచ్చిందని తెలిపింది.

ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యుత్తు బోర్డు చీఫ్‌ ఇంజినీర్‌ రాజ్యలక్ష్మి స్పందించారు. ఈ సందర్భంగా... సెప్టెంబర్ 27 రాత్రి ఈ-రోడ్డులోని వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేస్తూ.. టీవీకే నుండి లేఖ అందిందని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. అందులో విజయ్‌ మాట్లాడుతున్నప్పుడు కొంతసేపు విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని కోరారన్నారు.

అయితే ఆ అభ్యర్థనను తాము తిరస్కరించామని రాజ్యలక్ష్మి వెల్లడించారు. మరోవైపు ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తూ.. తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంటు కోత లేదని.. ఆ పార్టీ ఏర్పాటుచేసిన జనరేటర్లలో సమస్య కారణంగా కొన్ని లైట్లు మసకబారాయని జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు.

టీవీకే నాయకులపై కేసు నమోదు:

కరూర్ లో టీవీకే పార్టీ అధినేత విజయ్‌ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆ పార్టీ నాయకులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ దుర్ఘటనపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్‌ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు.

Tags:    

Similar News