క‌రూర్ తొక్కిస‌లాట‌: క‌న్నీరు ఆర‌క‌ముందే.. కుమ్మేసుకుంటున్నారు!

త‌మిళ‌నాడులోని క‌రూర్ జిల్లా.. వేలుసామిపురం ప్రాంతంలో శనివారం రాత్రి జ‌రిగిన తొక్కిస‌లాట‌లో మృతుల సంఖ్య మరింత పెరిగింది.;

Update: 2025-09-29 12:16 GMT

త‌మిళ‌నాడులోని క‌రూర్ జిల్లా.. వేలుసామిపురం ప్రాంతంలో శనివారం రాత్రి జ‌రిగిన తొక్కిస‌లాట‌లో మృతుల సంఖ్య మరింత పెరిగింది. నిన్న‌టి వ‌ర‌కు 40గా ఉన్న ఈ సంఖ్య 41కి చేరింది. మ‌రింత మంది ప్రాణాల‌తో కొట్టుమి ట్టాడుతున్నార‌ని అధికారులు తెలిపారు. త‌మిళ వెట్రి క‌ళ‌గం(టీవీకే) పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ నేతృత్వంలో నిర్వ‌హించిన ఈ ర్యాలీలో భారీ తొక్కిస‌లాట జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మృతుల‌కు.. రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌లు, కేంద్రం రూ.2 ల‌క్ష‌లు, విజ‌య్ రూ.20 ల‌క్ష‌లు చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు.

ఇక‌, ఈ ఘ‌ట‌నలో ఒక‌వైపు.. బాధిత కుటుంబాల క‌న్నీరు ఆర‌క‌ముందే.. అధికార పార్టీ స‌హా విప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయ యుద్ధం మొద‌లైంది. ఈ ఘ‌ట‌న‌కు ప్ర‌భుత్వానిదే త‌ప్ప‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అన్నాడీఎంకే విమ‌ర్శ‌లు గుప్పించిం ది. దీనిని తామురాజ‌కీయ కోణంలో చూడ‌డం లేద‌ని అధికార పార్టీ డీఎంకే చెబుతోంది. కానీ, అన్నాడీఎంకే నేత‌లు మాత్రం ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని, సీఎం స్టాలిన్ ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హించి.. రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇక‌, మ‌రోవైపు.. ఈ ఘ‌ట‌న‌ను స్థానిక అధికారులు, రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జస్టిస్ అరుణ‌తో విచార‌ణ‌కు రాష్ట్ర స‌ర్కారు ఆదేశించింది.

కానీ.. దీనిని త‌ప్పుబ‌డుతూ.. విజ‌య్ నేతృత్వంలోనిటీవీకే పార్టీ.. సీబీఐకి ఇవ్వాల‌ని హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే త‌మ‌ను ఇబ్బంది పెట్టింద‌ని.. అందుకే ఈ తొక్కిస‌లాట చోటు చేసుకుంద‌ని పిటిష‌న్‌లో పేర్కొంది. విద్యుత్ అధికారులు విజ‌య్ స‌భ‌కు వ‌స్తున్న స‌మయంలో ప‌వ‌ర్ క‌ట్ చేశార‌ని.. దీంతో ప్ర‌జ‌లు ఏం జ‌రుగుతోందో తెలియ‌క తోపులాట‌ల‌కు దిగార‌ని.. టీవీకే చెబుతోంది. మ‌రోవైపు డీజీపీ స‌హా విద్యుత్ శాఖ మంత్రి ఈఆ రోప‌ణ‌ల‌ను ఖండించారు. విద్యుత్ కోత పెట్టాల‌ని టీవీకే నాయ‌కులే త‌మ‌ను కోరార‌ని.. కాబ‌ట్టే విద్యుత్ క‌ట్ చేశార‌ని చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే.. ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌త‌గా టీవీకే పార్టీకిచెందిన క‌రూర్ జిల్లా నాయ‌కులు.. 15 మందిని పోలీసులు అరెస్టు చేయ‌డం మ‌రింత వివాదానికి దారితీసింది. విచార‌ణ చేప‌ట్ట‌కుండానే.. బాధ్యులు ఎవ‌రో తేల‌కుండానే ఎలా అరెస్టులు చేస్తార‌ని విజ‌య్ ప్ర‌శ్నించారు. అందుకే తాము ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని కోరుతున్న‌ట్టు తెలిపారు. అయితే.. ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో బాధ్యులు ఎవ‌ర‌నేది త‌మ‌కు తెలిసింద‌ని.. అందుకే అరెస్టులు చేస్తున్నామ‌ని డీజీపీ చెబుతున్నారు. మొత్తంగా ఒక‌వైపు బాధితులు క‌న్నీరు పెట్టుకుంటుంటే.. వారిని ఓదార్చ‌డం మానేసి రాజ‌కీయాలు చేసుకోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News