రెండు భాషలే అంటున్న కర్ణాటక...ఎన్డీయేతో ఢీ !
దేశంలోని పాఠశాలల్లో భోధించే భాషలపైన ఇపుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. హిందీ భాషను రుద్ద వద్దు అని మొదట గర్జించింది తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం;
దేశంలోని పాఠశాలల్లో భోధించే భాషలపైన ఇపుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. హిందీ భాషను రుద్ద వద్దు అని మొదట గర్జించింది తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం. ఆ తరువాత మహారాష్ట్రలో హిందీ భాష అమలు మీద అక్కడ మరాఠీలలో ఆందోళన సాగింది. రాజకీయ పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.
దాంతో ఇపుడు అదే బాటన కర్ణాటక నడవనుంది. త్రిభాషా సూత్రం కాదు రెండు భాషలే మాకు ముద్దు అని అంటోంది. ఈ మేరకు ద్విభాషా సూత్రాన్ని అమలు చేయడానికి కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం జాతీయ విద్యా విధానం మేరకు దేశవ్యాప్తంగా పాఠశాలలలో త్రిభాషా సూత్రాన్ని సిఫార్సు చేసింది. అయితే దానిని కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించింది. ఇక ఎన్డీయే నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వమే త్రిభాషా సూత్రాన్ని ప్రాథమిక పాఠశాలలో అమలు చేయడాన్ని నిలిపివేసిన క్రమంలో కర్ణాటకలో కూడా తమ ప్రభుత్వం ద్విభాషా విధానానికి మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
తాజాగా ఆయన మైసూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ద్విభాషా విద్యా విధానానికి కట్టుబడి ఉన్నామని ఇదే తమకు అనుకూలమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇప్పటికే త్రిభాషా సూత్రం మీద జాతీయ నూతన విద్యా విధానం మీద చర్చ సాగుతోంది.
ఈ క్రమంలో సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతే కాదు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇక కర్ణాటకలో చూస్తే ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో విద్యార్థుల అయిదవ తరగతి వరకూ రెండు భాషలే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఆరవ తరగతి నుంచి మూడవ భాషగా హిందీని ప్రవేశపెడతారు. ఇక ఎనిమిదవ తరగతిలో కన్నడ ఇంగ్లీష్ లేదా సంస్కృతంలో ఏదో ఒకదానిని మొదటి భాషగా ఎన్నుకోవాల్సి ఉంటుంది.
ఇక ఏదైన విద్యార్ధి సంస్కృతాన్ని మొదటి భాషగా ఎంచుకుంటే వారికి కన్నడ భాష మూడవదిగా తప్పనిసరి అవుతుంది. ఇదిలా ఉంటే ఇక మీదట రెండు భాషల విధానాన్నే కర్ణాటకలో అమలు చేస్తామని సిద్ధరామయ్య చెప్పడం బట్టి చూస్తే కనుక మరో రాష్ట్రంలో ఎన్డీయే జాతీయ విద్యా విధానానికి పక్కాగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది అని అంటున్నారు.
ఇదే తీరున దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో కూడా ఉంటే కనుక కేంద్రం తీసుకుని వచ్చిన నూతన జాతీయ విధానం అమలు అతి పెద్ద సవాల్ గా మారుతుంది. అంతే కాదు ఏకంగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాలే అమలు చేయలేకపోతే ఇక విపక్షాలు ఉన్న చోట్ల అది అసలు అమలు చేయలేరు అన్నది తేలుతోంది. మొత్తానికి త్రిభాషా విధానం మీద ఇంతలా రచ్చ జరుగుతున్న వేళ కేంద్రం మరోసారి జాతీయ విద్యా విధానం మీద పున సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దేశమంతా ఒకే రకమైన విధానం విద్యారంగంలో అమలు కావాలంటే రాష్ట్రాలతో కేంద్రం సంప్రదించి ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని విద్యా రంగంలోని నిపుణులు అంటున్నారు.