రాహుల్ రాక... కర్ణాటక కాంగ్రెస్ లో కాక

కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కర్ణాటకకు సడెన్ గా వచ్చారు. సడెన్ గా అంటే ముందస్తు షెడ్యూల్ ఫిక్స్ అయ్యే ఉండొచ్చు;

Update: 2026-01-15 06:00 GMT

కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కర్ణాటకకు సడెన్ గా వచ్చారు. సడెన్ గా అంటే ముందస్తు షెడ్యూల్ ఫిక్స్ అయ్యే ఉండొచ్చు. ఆయన మైసూరులో ల్యాండ్ అయ్యారు. రాహుల్ పర్యటనలో విశేషాలు ఏమిటో కానీ కర్ణాటక రాజకీయాన్ని కాక పుట్టించడంలో అగ్ర నేత టూర్ కీలక పాత్ర పోషించింది అని అంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా రాహుల్ రాక వల్ల ఎందుకు అగ్గి రాజుకుంటుంది అంటే అక్కడే ఉంది మ్యాటర్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా రెండు బలమైన వర్గాలు ఉన్నాయి. ఇద్దరు అగ్ర నేతలు ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రిగా మరొకరు ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నెరుపుతున్నారు. సీఎం సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సరిసాటిగా పోటీగా ఉన్నారు. ఇద్దరు కీలక నేతలూ ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగా రాజకీయాలు చేస్తూ ఉంటారు.

ఒప్పందం అంటూ :

కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 2023 మేలో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీకి అప్పటికి పీసీసీ చీఫ్ గా డీకే శివకుమార్ ఉంటే సీఎల్పీ నేతగా సిద్దరామయ్య ఉన్నారు. ఈ ఇద్దరూ నేతలూ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు, ఈ ఇద్దరూ కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చారు. దాంతో ఎవరి సీఎం అన్నది కూడా నాడే పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. అయితే పెద్దాయనగా అప్పటికి ఒక ఫుల్ టెర్మ్ సీఎం గా చేసి పాలనానుభవం నిండుగా ఉన్న నేతగా సిద్ధరామయ్యకు తొలి ప్రాధాన్యతను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఇచ్చింది. అదే సమయంలో డీకే శివకుమార్ ని ఉప ముఖ్యమంత్రిగా చేస్తూ చెరి రెండున్నరేళ్ళూ అధికారం పంచుతామని కాంగ్రెస్ పెద్దలే ఒక అనధికార ఒప్పందం కుదిర్చారు అని ప్రచారం అయితే సాగింది.

జోరందుకున్న వైనం :

అయితే సిద్ధరామయ్య రెండున్నరేళ్ళ టెర్మ్ 2025 నవంబర్ నాటికి పూర్తి అయింది. దాంతో అప్పటికి కొన్ని నెలల క్రితం నుంచే డీకేని సీఎం గా చేయాలని ఆయన వర్గం పట్టుబడుతూ వస్తోంది. ఇక నాటి నుంచి నేటి దాకా పైకి అంతా ఒక్కటిగా ఉన్నారని అనిపిస్తున్నా లోపల మాత్రం వర్గాలు వర్గ పోరు అలాగే గట్టిగా ఉంది అని అంటున్నారు. డీకే వర్గం అయితే నేడో రేపో మా బాస్ సీఎం అని అంటూంటే అయిదేళ్ళూ సిద్ధరామయ్య సీఎం అని ఆయన వర్గం మంత్రులు నేతలూ చెబుతూ వస్తున్నారు. ఇక డీకే సిద్ధూల మధ్య సామరస్యం కుదిర్చేందుకు బ్రేక్ ఫాస్ట్ లంచ్ పార్టీలను కాంగ్రెస్ పెద్దలు అరెంజ్ చేసినా మ్యాటర్ అలాగే ఉంది. దాంతో కర్ణాటక కాంగ్రెస్ లో రాజకీయం అయితే నివురు గప్పిన నిప్పు మాదిరిగా ఉంది అని అంటున్నారు.

రాహుల్ తో వరుస భేటీలు :

ఇదిలా ఉంటే మైసూర్ వచ్చిన రాహుల్ గాంధీని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలుసుకుని చర్చించారు. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కూడా కలసి అనేక అంశాలను మాట్లాడారు అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఈ ఇద్దరు అగ్ర నేతలతో విడివిడిగా భేటీ వేశారు, ఆ తరువాత ఇద్దరినీ కలిపి భేటీ నిర్వహించారు అని అంటున్నారు. మరి రాహుల్ గాంధీ వారికి ఏమి చెప్పారు అన్నది తెలియదు కానీ ఈ ఇద్దరితో జరిగిన భేటీ సమాలోచనలు కర్ణాటక కాంగ్రెస్ లో కాక పుట్టిస్తున్నాయని అంటున్నారు.

మంత్రి వర్గ విస్తరణ :

ఇక కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని ఎప్పటి నుంచో మంత్రి వర్గ విస్తరణకు సీఎం సిద్దరామయ్య అనుమతి కోరుతున్నారు. ఆ మధ్యన ఢిల్లీ కూడా ఆయన వెళ్ళి వచ్చారని కూడా చెబుతారు. ఇపుడు తన సొంత స్టేట్ కే వచ్చిన రాహుల్ గాంధీని కలసి ఈ మేరకు రిక్వెస్ట్ చేశారు అని అంటున్నారు. మరి దానికి రాహుల్ ఏమి చెప్పారు అన్నది తెలియాల్సి ఉంది. ఇంకో వైపు మంత్రి వర్గ విస్తరణ అంటూ జరిగితే డీకేకి మద్దతుగా ఉన్న మంత్రులను పక్కన పెట్టి తన వర్గం వారితో పూర్తిగా నింపాలని సిద్ధరామయ్య చూస్తున్నారు అని టాక్ కూడా ప్రచారంలో ఉంది. అదే కనుక జరిగితే అసలు ఊరుకునేది లేదని డీకే తన వర్గీయులతో అన్నట్లుగా చెబుతున్నారు ఆయన హైకాండ్ కి కూడా ఈ విషయంలో తన మనసులో మాటను చెప్పారని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే సిద్ధరామయ్య వర్సెస్ డీకే ఇష్యూ అలా రగులుతూనే ఉంది, రాహుల్ గాంధీ వచ్చి దాన్ని తగ్గించారా అంటే మరింతగా పెరిగిపోయింది అని ప్రచారం అయితే సాగుతోంది.

Tags:    

Similar News