వైసీపీ బిగ్ షాట్ సైకిలెక్కేస్తారా ?
ఇక ప్రకాశం జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా కరణం బలరాం కి ఎంతో పేరు ఉంది. ఆయన 1978లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అదే ఎన్నికల్లో వైఎస్సార్ చంద్రబాబు కూడా గెలిచారు.;
వైసీపీ నుంచి కూటమి వైపు నాయకుల వలస తొలి ఏడాది పెద్దగా సాగింది. ఇటీవల కాలంలో మందగించింది. అయితే ఇంకా చాలా మంది తటపటాయిస్తూనే పార్టీలో ఉంటున్నారు అని అంటున్నారు. వారి అన్యమనస్కంగానే వ్యవహరిస్తున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఈ నేతల చూపు అధికార కూటమి వైపే ఉందని అయితే సరైన పిలుపు కోసం గట్టి హామీ కోసం వేచి చూస్తున్న వారే అలా ఉంటున్నారు అని అంటున్నారు ఆ విధంగా చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మాజీ మంత్రులు ఎమ్మెల్యేల నుంచి గోదావరి జిల్లాలు కోస్తా రాయలసీమ జిల్లాల దాకా సీన్ ఇలాగే ఉంది అని అంటున్నారు.
కరణం వెయిటింగ్ :
ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నాయకుడు కరణం బలరాం టీడీపీలో చేరేందుకు చకచకా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఆయన చాలా కాలంగా సైకిలెక్కాలని ఉబలాటపడుతున్నారని అంటున్నారు. నిజం చెప్పాలీ అంటే ఆయన టీడీపీ నాయకుడే. అయితే 2019 ఎన్నికల్లో జగన్ ప్రభజనాన్ని సైతం తట్టుకుని చీరాలలో గెలిచిన కరణం బలరాం 2020 మార్చిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే ఆయన కుమారుడికి 2024 ఎన్నికల్లో అదే చీరాల నుంచి వైసీపీ టికెట్ ఇచ్చింది. కానీ కూటమి సునామీలో ఓటమి పాలు అయ్యారు. నాటి నుంచే కరణం ఫ్యామిలీ చూపులు పసుపు శిబిరం మీద ఉన్నాయని అంటున్నారు.
బాబుకు సమకాలీనుడిగా :
ఇక ప్రకాశం జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా కరణం బలరాం కి ఎంతో పేరు ఉంది. ఆయన 1978లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అదే ఎన్నికల్లో వైఎస్సార్ చంద్రబాబు కూడా గెలిచారు. అయితే ఆనాటి నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచినా కరణం మంత్రి మాత్రం కాలేకపోయారు. ఇక ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా ఎంతో చురుకైన పాత్ర పోషించారు. పార్టీకి వెన్ను దన్నుగా ఉన్నారు. అయితే ఆయన వైసీపీలో చేరి తప్పు చేశారు అని ఆయనను అభిమానించేవారు కూడా అంటారట.
కుమారుడి కోసమే :
తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీ వైపు కరణం చూస్తున్నారు అని అంటున్నారు. కరణం వెంకటేష్ కి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కరణం చూస్తున్నారు అని అంటున్నారు. దాని కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు అయితే ఫలించాయని అంటున్నారు. ఆయన రాక పట్ల జిల్లాలోని నాయకులు కూడా స్వాగతిస్తున్నారు అంటున్నారు. ఇక టీడీపీ అధినాయకత్వం ఆయన విషయంలో సానుకూలంగా ఉందని తాజాగా వినిపిస్తున్న మాటగా ఉంది.
మంచి ముహూర్తం చూసి :
ఇదిలా ఉంటే ఒక మంచి ముహూర్తం చూసుకుని కరణం బలరాం తమ కుమారుడితో కలసి టీడీపీలోకి వెళ్తారు అని అంటున్నారు. ఆ శుభ సమయం కోసమే ఆయన వర్గం అంతా ఎదురుచూస్తోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ప్రకాశం జిల్లాలో చీరాలతో పాటు సంతనూతలపాడు నియోజకవర్గం మీద కరణం ఫ్యామిలీ చూపు ఉందని అంటున్నారు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన జరిగితే సంతనూతలపాడు అన్ రిజర్వుడు సీటు అవుతుందని అంటున్నారు.దాంతో ఇక్కడ తమ బలమానికి తోడు టీడీపీ ఇమేజ్ జత కూడి వెంకటేష్ ఎమ్మెల్యే కచ్చితంగా అవుతారు అన్న లెక్కెలేఅవో కరణం బలరాం కి ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి కరణం వంటి బిగ్ షాట్ వైసీపీని వీడిపోవడం ఖాయమని ప్రచారం అయితే జిల్లాలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.