ఫైర్ బ్రాండ్ పంతం ఇన్నాళ్లకు నెరవేరింది!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ రాజకీయాల్లోనూ అదే పంథాను అనుసరిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.;
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ రాజకీయాల్లోనూ అదే పంథాను అనుసరిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై స్పందించి సంచలనం సృష్టించిన కంగన ఆ మధ్య సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై కూడా స్పందించి బాలీవుడ్‌లో పెను ప్రకంపణలు సృష్టించింది. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి భారతీయ జనతాపార్టీ తరుపున హిమాచల్ ప్రదేశ్.. మండి నియోజక వర్గం నుంచి ఎంపీగా విజయకేతనాన్ని ఎగురువేసింది. ప్రస్తుతం పార్లమెంట్‌లో తన వాయిస్‌ని బలంగా వినిపిస్తూ ప్రత్యర్థులకు దడపుట్టిస్తోంది.
ప్రస్తుతం ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌తో పాటు `భారత భాగ్య విధాత` మూవీలో నటిస్తోంది. పాలిటిక్స్‌ని, సినిమాలని బ్యాలెన్స్ చేసుకుంటోంది. తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీపై కంగన ఫైర్ అయి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని `మహాయుతి` కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బృహన్ ముంబయి కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనిపై నటి ఫైర్ బ్రాండ్, భాజపా ఎంపీ కంగనా రనౌత్ ఆనందం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ముంబాయిలోని తన ఆఫీసు కూల్చివేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కంగన ..ఉద్ధవ్ ఠాక్రే పార్టీపై విమర్శలు గుప్పించింది. `బీఎంసీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడం గొప్ప విషయం. గతంలో నన్నువేధించిన వారిని, నా బంగ్లాను కూల్చివేసిన వారిని, మహారాష్ట్ర నుంచి నన్ను వెళ్లిపోవాలని బెదిరించిన వారిని ఇప్పుడు రాష్ట్రమే వదిలేసింది. మహిళలపై ద్వేష భావం ఉన్న బంధుప్రీతి మాఫియాకు మహారాష్ట్ర ప్రజలు సరైన చోటు చూపించారు` అని ఫైర్ అయింది. 2020లో ముంబయిలోని బాంద్రాలో కంగన ఆఫీస్‌కు సంబంధించిన ఓ భాగాన్ని అప్పటి బీఎంసీ అధికారులు అక్రమ కట్టడం అంటూ కూల్చేశారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగన ముంబాయి హైకోర్టుని ఆశ్రయించడంతో వివాదం తారా స్థాయికి చేరి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ కేసుని సునిశితంగా పరిశీలించిన ముంబాయి హైకోర్టుని ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్చగా తేల్చి నాటి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కూల్చివేతలు ఆపాలని, జరిగిన నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు కంగన యంగ్ హీరో సుశాంత్ సింగ్‌రాజ్ పుత్ మరణం వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని విమర్శలు చేయడంతో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ వర్గాలకు, కంగనకు మధ్య వార్ మొదలైంది.
అప్పటి నుంచి కంగనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ప్రతి విషయంలోనూ కంగనని ఇబ్బందులకు గురి చేస్తూ తన సహనాన్ని పరీక్షించడంతో కంగణ కూడా ఎదురు దాడి చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కంగన బీజేపీ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది. అప్పటి నుంచి మరింత బలంగా తన వాదన వినిపిస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గంపై ఫైర్ అవుతూ వస్తోంది. తాజాగా వెలువడిన మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలతో ఉద్దవ్ ఠాక్రే పార్టీ ఓటమి పాలు కావడంతో తన పంతం ఇన్నాళ్లకు నెరవేరిందని కంగన ఆనందాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.