రాజకీయ భారతీయుడు...డీఎంకేకి మంచి మిత్రుడు
ఇప్పటికి ముప్పయ్యేళ్ళ క్రితం భారతీయుడు సినిమా వచ్చింది. అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అర్ధ శతాబ్దం అయింది.;
ఇప్పటికి ముప్పయ్యేళ్ళ క్రితం భారతీయుడు సినిమా వచ్చింది. అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అర్ధ శతాబ్దం అయింది. కేంద్రంలో ప్రభుత్వాలు కూడా స్థిరంగా ఉండని స్థితి. అంతే కాదు అన్ని విధాలుగా విసిగి జనాలు ఉన్నారు. ఆ సమయంలో వెండి తెర మీద అవినీతి అక్రమాల మీద విక్రమార్కుడి మాదిరిగా డెబ్బై ఏళ్ళ భారతీయుడు విరుచుకుపడి విశ్వరూపం ప్రదర్శిస్తూంటే జనాలు జేజేలు పలికారు. భారతీయుడు లాంటి వారు ఒక్కరు ఉండాలి కదా అని చప్పట్లు కొట్టారు. అది రాజకీయ వాసనలు ఉన్న చిత్రం, అలా కొన్ని సినిమాలు కమల్ చేసి వెండి తెర మీద నటుడిగా రంజింపచేశారు.
లెఫ్ట్ ఈజ్ రైట్ అంటూ :
ఇక కమల్ నిజ జీవితంలో లెఫ్టిస్ట్ ఫిలాసఫీని ఇష్టపడతారు. ఆయన తన భావాలను ఎక్కడా దాచుకోలేదు. సందర్భం దొరికిన ప్రతీ సారీ చెబుతూ వస్తూనే ఉన్నారు. అలా తనకంటూ ఒక సొంత పార్టీని స్థాపించారు. దాని పేరు మక్కల్ నీది మయ్యం. ఆ పార్టీ తరఫున 2021లో తమిళనాడులో మొత్తం అన్ని అసెంబ్లీ సీట్లకు పోటీ చేసి తాను కూడా అసెంబ్లీకి నెగ్గలేక ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు. డీఎంకేకి మద్దతు ఇచ్చారు. ఫలితంగా ఆ పార్టీ నుంచి రాజ్యసభ సీటు అందుకుని ఎంపీ అయ్యారు. దాంతో కమల్ రాజకీయం పెద్దల సభ మెట్లు ఎక్కినట్లు అయింది.
ఏవీ కమల్ అంటూ :
ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ కుసుమములు అంటూ నిర్వేదం చెందాల్సిన స్థితి అని అన్నట్లుగానే ఉందా కమల్ ప్రస్తుత స్థితి అన్నది ఒక విశ్లేషణ. ఆయన మీద గతంలో విమర్శలు రాజకీయంగా ఎన్ని వచ్చినా ఈ తరహాలో రాలేదు. ఇపుడు మత్రం బీజేపీ దుమ్మెత్తి పోస్తోంది. తాజాగా గట్టిగానే కామెంట్స్ చేసింది. దానికి కరణం కమల్ తాజాగా చేసిన పర్యటన. గత నెల 27న కరూర్ పట్టణంలో సినీ నటుడు విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఏకంగా 42 మంది దాకా మరణించరు. తాజాగా కమల్ హాసన్ స్థానిక డీఎంకే నేతలతో కలిసి కరూర్ దుర్ఘటన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది దురదృష్టకరమైన ఘటన అయినప్పటికీ ప్రభుత్వ వైఫల్యం కాదని అన్నారు. పోలీసులు తమ విధిని సక్రమంగా నిర్వర్తించారని మెచ్చుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బగా వ్యవహరించారని కితాబిచ్చారు. దీంతోనే బీజేపీ నేతలకు మంటెక్కింది.
ఆత్మ గౌరవం ఏదీ అంటూ :
కమల్ హాసన్ మీద తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఒక లెవెల్ లో విమర్శలు చేశారు కమల్ తన కోసం కేవలం ఒక్క రాజ్యసభ సీటు కోసం తన రాజకీయ పార్టీని తనకు ఉన్న ఆత్మగౌరవాన్ని అధికార డీఎంకే పార్టీకి అమ్ముకున్నారని అన్నామలి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా కమల్ హాసన్ మాట్లాడటం మీద ఆయన ఫైర్ అయ్యారు. కమల్ కేవలం పెద్దల సభలో అడుగు పెట్టడానికి తన అంతరాత్మను సైతం అమ్ముకున్నారని దుయ్యబెట్టారు. కరూర్ బాధితులను పరామర్శించడానికి వెళ్లి ప్రభుత్వం తప్పులేదని సర్టిఫికేట్ ఇస్తారా కమల్ అని ప్రశ్నించారు. అసలు ఎందుకు మీరు ఇంతగా దిగజారిపోతున్నారు అని కూడా నిలదీశారు. ఇవన్నీ ఎలా ఉన్నా కమల్ హాసన్ ఏమి చెప్పినా తమిళనాడు ప్రజలు ఆయను పట్టించుకునే స్థితిలో కూడా లేరని అన్నామలై సెటైర్లు వేశారు.
అది ఒక్కటీ చాలునా :
కమల్ హాసన్ తన పార్టీ ద్వారా కొత్త రాజకీయం తీసుకుని వస్తామని చెప్పారు. అయితే అది అసాధ్యమని ఆయన భావించారో లేక తాను పార్టీని నడపలేనని అనుకున్నారో ఒక ఎంపీ సీటుకే పరిమితం అయిపోయారా అని ఆయన అభిమానులు కూడా అంటున్నారు. అయితే సినిమా వారికి రాజకీయాలు చేయడం అంటే కత్తి మీద సాము అన్నది కూడా ఉంది. రీల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు అన్నది కూడా చెబుతారు. సో కమల్ చేసినది మంచి పని అన్న వారు ఉన్నారు. మొత్తానికి ఆయన వెండి తెర భారతీయుడు కావచ్చేమో కానీ బయట మాత్రం మామూలు నాయకుడు అని అన్న వారూ ఉన్నారు. అదన్న మాట నాయకన్ మార్క్ పాలిటిక్స్ అని బీజేపీ విమర్శలు చేస్తోంది.