సిగరెట్ తెచ్చివ్వలేదు.. అందుకే గొడవ- కల్పిక!
కల్పిక.. హీరోయిన్ ఫ్రెండ్ తరహా పాత్రలతో ఒక మోస్తరుగా గుర్తింపు తెచ్చుకున్న నటి. ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి.;
కల్పిక.. హీరోయిన్ ఫ్రెండ్ తరహా పాత్రలతో ఒక మోస్తరుగా గుర్తింపు తెచ్చుకున్న నటి. ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. ఐతే సినిమాల్లో వచ్చిన గుర్తింపు కంటే.. సోషల్ మీడియా ద్వారా ఆమెకు వచ్చిన పాపులారిటీనే ఎక్కువ. తరచుగా ఏదో ఒక వివాదంతో ఆమె వార్తల్లోకి వస్తుంటుంది. గతంలో తమిళ నటి ధన్య బాలకృష్ణన్‌తో కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగడం తెలిసిందే.
ఇక ఈ మధ్య ఒక పబ్బులో నానా రచ్చ చేయడంతో కల్పిక పేరు మార్మోగింది. దీనికి సంబంధించి కేసు కూడా అయింది. ఆ గొడవ కాస్త సద్దుమణిగింది అనుకునే లోపే.. కల్పిక ఇప్పుడు కొత్త వివాదంతో వార్తల్లోకి ఎక్కింది. హైదరాబాద్ శివార్లలోని ఒక రిసార్టులో సిబ్బందితో ఆమె గొడవ పడుతున్న సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కల్పికకు ఎప్పుడూ ఇదే పనా అంటూ.. నెటిజన్లు ఆమె మీద ఫైర్ అయ్యారు. దీంతో ఆమె ఈ గొడవ గురించి ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
తన తల్లిదండ్రులతో కలిసి ఇటీవల బ్రౌన్ టౌన్ అనే రిసార్టుకు వెళ్లామని.. అది సిటీకి కొంచెం దూరంగా ఉంటుందని.. ధర తక్కువ అని దాన్ని బుక్ చేశామని.. కానీ అక్కడ సిగ్నల్స్ లేక, వైఫై లేక చాలా ఇబ్బంది పడ్డామని కల్పిక వెల్లడించింది. తన గదిని ఖాళీ చేసి.. అక్కడి నుంచి దూరంగా ఉన్న రిసెప్షన్‌కు వచ్చాక చెక్ ఔట్ చేసే సమయంలో బిల్లు కట్టడంలో ఇబ్బంది తలెత్తిందని ఆమె చెప్పింది. బిల్లు కోసం సిబ్బంది తొందర పెట్టారని.. జీపే ద్వారా బిల్లు చెల్లించానని కల్పిక వెల్లడించింది.
క్యాబ్ బుక్ చేసుకుందామన్నా వైఫై పని చేయలేదని.. తమను డ్రాప్ చేయమని అడిగితే రిసార్ట్ సిబ్బంది దురుసుగా మాట్లాడారని ఆమె చెప్పింది. అప్పటికి వాతావరణం చాలా చల్లగా ఉండడంతో తనకు సిగరెట్ తాగాలి అనిపించిందని.. కానీ తన సిగరెట్ ప్యాకెట్ తన గదిలో ఉండిపోయిందని.. దాన్ని తెచ్చి ఇవ్వమంటే స్టాఫ్ తెచ్చి ఇవ్వలేదని.. ఇంతకుముందు ఏ రిసార్ట్‌లోనూ ఇలా జరగలేదని.. వాళ్లు తన సిగరెట్ ప్యాకెట్ తెచ్చి ఇవ్వనందుకు కోపం వచ్చిందని ఆమె చెప్పింది. ఎంత నిదానంగా చెప్పాలని చూసినా వినకపోవడంతో మేనేజర్‌తో గొడవకు దిగాల్సి వచ్చిందని కల్పిక వివరణ ఇచ్చింది.