సెల్ఫీలకు వచ్చే అమ్మాయిలకు నిండుగా దుస్తులు ధరించమని చెబుతా

మంత్రి మాటలకు సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టటం.. నవ్వులు చిందించటం లాంటివి చేయగా.. సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి.;

Update: 2025-06-06 06:30 GMT

మధ్యప్రదేశ్ మంత్రి.. బీజేపీ సీనియర్ నేత కైలాస్ విజయ్ వర్గీయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ హైలెట్ అయ్యాయి. మహిళలు ధరించాల్సిన దుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. మహిళలు పొట్టి దుస్తులు ధరించటాన్ని ఆయన తప్పు పట్టారు. ‘విదేశీ ఆచారమైన ఈ ధోరణి భారత సంప్రదాయానికి విరుద్ధం. మహిళల్నినేను దేవతగా చూస్తా’’ అని వ్యాఖ్యానించారు.

తాజాగా జరిగిన ఒక సభకు హాజరైన ఆయన.. బీజేపీ నేత ఒకరు చేసిన క్లుప్త ప్రసంగాన్ని అభినందించారు. నాయకులు సింఫుల్ స్పీచ్ లను మహిళలు ధరించే పొట్టి దుస్తులతో పోల్చే విదేశీ సామెతను తప్పు పట్టారు. ఈ సందర్భంగా మంత్రి కైలాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి. నిండైన దుస్తులతో సింగారించుకునే మహిళను మనం అందానికి ప్రతిరూపంగా చూస్తామని.. విదేశాల్లో మహిళలు ఎంత తక్కువ దుస్తులు ధరిస్తే అంత అందమైనదిగా చూస్తారన్నారు.

మంత్రి మాటలకు సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టటం.. నవ్వులు చిందించటం లాంటివి చేయగా.. సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. కొందరు సానుకూలంగా స్పందిస్తే.. మరికొందరు ప్రతికూలంగా రియాక్టు అవుతున్నారు. ఈ సందర్భంగా మరో అంశాన్ని ఆయన ప్రస్తావించారు. చాలాసందర్భాల్లో తనతో సెల్ఫీలు దిగేందుకు అమ్మాయిలు వస్తుంటారని.. ముందుగా నిండుగా దుస్తులు ధరించిన తర్వాతే సెల్పీలకు రావాలంటూ తాను వారికి చెబుతానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Tags:    

Similar News