పాక్ గూఢచర్యంలో జ్యోతి... పక్కా ఆధారాలు అంటూ ‘సిట్’ కీలక స్టెప్!

కాగా.. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌ కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-08-17 06:35 GMT

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ కు గూఢచర్యం చేస్తొన్నారనే ఆరోపణలపై దర్యాప్తు అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే! వారిలో 'ట్రావెల్ విత్ జో' పేరిట వ్లాగ్‌ నడిపే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఒకరు. పాకిస్తాన్ కోసం ఆమె గూఢచర్యం చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో.. సిట్‌ అధికారులు విచారణ చేశారు. ఈ సమయంలో కీలక ముందడుగు వేశారు.

అవును... హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. పాకిస్తాన్‌ కోసం గూఢచర్యం చేసినట్లు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని మూడు నెలల పాటు దర్యాప్తు చేసిన సిట్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమెపై 2,500 పేజీల ఛార్జ్‌ షీట్‌ ను హిసార్ కోర్టులో దాఖలు చేశారు! దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో ఆమెకు ఐ.ఎస్‌.ఐ ఏజెంట్లు షాకిర్, హసన్ అలీ, నాసిర్ ధిల్లన్‌ లతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని.. 2024లో పాకిస్తాన్, చైనా, నేపాల్ దేశాలకు ఆమె ప్రయాణించిన వివరాలను చార్జ్‌ షీట్‌ లో నమోదు చేశారని తెలుస్తోంది. పాకిస్తాన్‌ లో ఆమె మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మేరియం షరీఫ్‌ ను కలిసినట్లు చెబుతున్నారు!

కాగా.. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌ కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐ.ఎస్‌.ఐకు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికార రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్.ఎస్) చట్టాల కింద కేసు నమోదు చేశారు.

ఆమె ఢిల్లీలోని పాకిస్తాన్‌ హై కమిషన్‌ లోని ఒక ఉద్యోగితో రహస్య సమాచారాన్ని పంచుకొన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో... సదరు పాకిస్తానీ అధికారిని మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం భారత్‌ ను వీడాలని ఆదేశించింది.

Tags:    

Similar News