జూబ్లీహిల్స్ లో ‘జూబ్లీహిల్స్’ లేదే..?
హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది.;
హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది. హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం 29 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఇందులో జూబ్లీహిల్స్ ఒకటి కాగా, ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జూబ్లీహిల్స్ మున్సిపల్ డివిజన్ లేకపోవడం గమనార్హం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి. ఇందులో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ డివిజన్ లేదు. అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి జూబ్లీహిల్స్ పేరు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు ఈ నియోజకవర్గం ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలో ఉండేది. హైదరాబాద్ నగరంలోని మాస్, క్లాస్ ప్రజలు నివసించే ప్రాంతాలతో కలిపి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎర్రగడ్డ, బోరబండ, యాసుఫ్ గూడ, వెంగళరావునగర్, రెహమత్నగర్, షేక్ పేట డివిజన్లు కలిపారు. అయితే ఈ డివిజన్లకు జూబ్లీహిల్స్ ప్రాంతంతో సంబంధం లేకపోయినా అసెంబ్లీ నియోజకవర్గానికి జూబ్లీహిల్స్ పేరు పెట్టడం అంతుబట్టడం లేదు.
జూబ్లీహిల్స్ అంటేనే నగరంలోని సంపన్నులు నివసించే ప్రాంతం. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నిక అనగానే అంతా సంపన్నులు ఉంటారని భావిస్తారు. కానీ, ఈ నియోజకవర్గం పరిధిలో పెద్దగా సంపన్నులు నివాసం ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. పేదలతోపాటు మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి జనం మాత్రమే ఎక్కువగా నివసిస్తున్నారు. అదేవిధంగా మైనార్టీ ఓటర్లు భారీగానే ఉన్నారు. నిజానికి జూబ్లీహిల్స్ అంటే వీవీఐపీలే అందరికీ గుర్తుకు వస్తారు.
జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాలు ఉన్నాయి. అదేవిధంగా సినీ సెలబ్రెటీలు చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగార్జున, వెంకటేశ్ తో చాలా మంది సెలబ్రెటీలు జూబ్లీహిల్స్ లోనే నివసిస్తున్నారు. ఉభయ రాష్ట్రాలకు చెందిన చాలా మంది రాజకీయ నేతల నివాసాలు, పారిశ్రామికవేత్తల బంగ్లాలకు జూబ్లీహిల్స్ చిరునామా. అయితే ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ లో ఏ ఒక్క సెలబ్రెటికి ఓటు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అయితే జూబ్లీహిల్స్ లో సినీ సెలబ్రెటీలు ఎవరికీ ఓటు లేకపోయినా, సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వేల మంది కార్మికులకు ఓట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే యాసుఫ్ గుడ, రెహమత్ నగర్, వెంగళరావునగర్ పరిధిలో దాదాపు 24 వేల మంది సినీ కార్మికులు నివసిస్తున్నారు. వీరందరికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఓట్లు ఉన్నాయి. దీంతో జూబ్లీహిల్స్ తీర్పులో సినీ కార్మికులు కీలకంగా చెబుతున్నారు.
మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ డివిజన్ లేకపోవడంతో ఇక్కడ నివసించే ప్రముఖులు, సంపన్నులు, సెలబ్రెటీలకు ఎక్కడ ఓట్లు ఉన్నాయనే అంశం కూడా ఆసక్తి రేపుతోంది. అయితే జూబ్లీహిల్స్ డివిజన్ ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. దీంతో ప్రముఖులు అందరి ఓట్లు ఆ అసెంబ్లీ పరిధిలో నమోదు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి.