జూబ్లీహిల్స్ పోరు: దానం ఎంట్రీ.. ఎవరి ఓటు 'దానం'?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు మరింత వేడి రాజుకుంది. ఎన్నికల పోలింగ్‌కు మరో 15 రోజులు మాత్రమే గడువు ఉంది.;
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు మరింత వేడి రాజుకుంది. ఎన్నికల పోలింగ్‌కు మరో 15 రోజులు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల 11న ఉప పోరు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్‌లు ప్రచార వేడిని పెంచాయి. మంత్రులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ముఖ్యంగా సీతక్క ఇంటింటి ప్రచారం కోసం.. ఏకంగా శాఖ పనులు కూడా పక్కన పెట్టారు. ఇక, తుమ్మల నాగేశ్వరరావు అటు ప్రచారం ఇటు ప్రభుత్వ పని రెండూ చేస్తున్నారు.
మరోవైపు బీఆర్ ఎస్ నాయకులు కూడా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ముం దుకు సాగుతున్నారు. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయాన్ని ఆయన పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రతి నిర్ణయాన్నీ తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు. ఇక బీజేపీ స్థానిక నాయకులు మాత్రమే ఈ ఉప ఎన్నికపై దృష్టిపెట్టారు. అధిష్టానం నాయకులు.. బీహార్‌పై దృష్టి పెట్టడంతో ఈ దఫా స్థానికులకే ఈ బాధ్యత అప్పగించేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీఆర్ ఎస్ నుంచి విజయం దక్కించుకుని.. ప్రస్తుతం కాంగ్రెస్ గూటిలో ఉన్న దానం నాగేందర్ ఉన్నారు. ఈ వ్యవహారం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. దానం ఏ పార్టీలో ఉన్నారంటూ.. మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కీలక నాయకుడు కేటీఆర్ నిలదీస్తున్నారు. తన ప్రచారంలోను, ప్రసంగంలోనూ దానం ఎవరి చుట్టం..? అంటూ.. ప్రశ్నిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ.. పార్టీకి మద్దతు మాత్రమే ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలావుంటే.. జూబ్లీహిల్స్‌లో దానం ప్రచారంతో కలిగే మేలెంత? అనేది ప్రశ్న. దానం ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైతరాబాద్.. జూబ్లీహిల్స్‌కు పక్కనే ఉంటుంది. పైగా.. ఆయనకు ఎక్కువ మంది పారిశ్రామిక వేత్తలతోనూ పరిచయాలు ఉన్నాయి. అంతేకాదు.. మంచి పలుకుబడి కూడా ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ కనీసం 10 శాతం ఓటు బ్యాంకును అయినా ప్రభావితం చేయగలరన్నది కాంగ్రెస్ అంచనా. అందుకే ఆయనను స్టార్ క్యాంపెయిన్ జాబితాలో చేర్చింది. అయితే.. ఇది బీఆర్ ఎస్ ఓటు బ్యాంకుకు ఇబ్బంది కలిగించే అంశమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.