జూబ్లీహిల్స్ ఉప బరి..కాంగ్రెస్ లో రోజుకో కొత్త పేరు

ఈ ఉప ఎన్నిక రేసులోకి దిగేందుకు పలువురు నేతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిని మించి మరొకరు భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు.;

Update: 2025-10-05 05:59 GMT

అనూహ్య పరిణామాల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో బీఆర్ఎస్ నేత.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా స్వర్గీయ గోపీనాథ్ సతీమణి సునీతను ప్రకటించటం తెలిసిందే. అధికార కాంగ్రెస్ లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఉప ఎన్నిక రేసులోకి దిగేందుకు పలువురు నేతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిని మించి మరొకరు భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎవరికి వారు తమకు మించిన అభ్యర్థి లేరన్నట్లుగా ప్రచారం చేసుకోవటం గమనార్హం. ఇందులో భాగంగా ఆయా నేతల వర్గీయులు జూబ్లీహిల్స్ లో ఫ్లెక్సీలు.. పోస్టర్లు.. పలు కార్యక్రమాల పేరుతో హడావుడి చేస్తున్నారు. రోజుకో నేత పేరు తెర మీదకు రావటంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రోజుకోఆశావాహుడి పేరు తెర మీదకు రావటం.. తీరా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత.. టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన వారంతా కలిసిపోవటం ఎంతవరకు సాధ్యం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఓవైపు టికెట్ ప్రయత్నాలు చేస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో తామెంత తోపులమన్న విషయాన్ని ప్రచారం చేసుకుంటూ.. నియోజకవర్గంలో ఎవరికి వారు దావత్ లు.. ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో.. కాంగ్రెస్ క్యాడర్ లో తీవ్రమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటివరకు రెండు.. మూడు పేర్లు వినిపించిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా పది మంది ఆశావాహులు కావటం.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

ఉప ఎన్నిక అంశం తెర మీదకు వచ్చినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులుగా అజారుద్దీన్.. నవీన్ యాదవ్.. దానం నాగేందర్ పేర్లు మాత్రమే వినిపించాయి. ఆ తర్వాత అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎంపిక చేయటంతో.. నవీన్ యాదవ్ కు టికెట్ ఖాయమన్న ప్రచారం జరిగింది. ఇలాంటి వేళలో అనూహ్య రీతిలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తాను రేసులో ఉన్నానని చెప్పటమే కాదు.. తన కొడుకు రాజ్యసభ సభ్యుడైతే ఏంటి? తాను ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఆశించకూడదని ప్రశ్నిస్తూ.. ప్రయత్నాలు చేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాదు ఎంపీ అభ్యర్థిగా ప్రయత్నాలు చేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీన్లోకి వచ్చారు. మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ కోడలు కంజర్ల విజయలక్ష్మి పేరుతో పాటు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్లు తెర మీదకు వచ్చాయి. మాజీ కార్పొరేటర్ మురళీ గైడ్.. రహ్మత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డిలు టికెట్లను ఆశిస్తున్న జాబితాలోచేరారు. ఇది సరిపోదన్నట్లు టీం రేవంత్ పేరుతో మైనంపల్లి హన్మంతరావు ప్రయత్నాలు షురూ చేశారు. వీరితో పాటు గత ఎన్నికల్లో కూకట్ పల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బండి రమేశ్ కూడా సీన్లోకి వచ్చారు. ఇలా దాదాపుపది మందికి పైనే కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్న పరిస్థితి.

ఈ పోటీ ఎలా ఉన్నా.. అంతిమంగా జూబ్లీహిల్స్ సీటును సొంతం చేసుకోవటం పైనే కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సిటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం లేని వేళ..కంటోన్మెంట్ కు జరిగిన ఉప పోరులో కాంగ్రెస్ అభ్యర్థి అనూహ్య విజయం నేపథ్యంలో.. జూబ్లీహిల్స్ లోనూ విజయం సాధించటం ద్వారా హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు పెరిగిందన్న విషయాన్ని స్పష్టం చేయాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News