బయటపడ్డ భారతదేశపు అతిపెద్ద బంగారు గని.. ఏపీలో ఎక్కడంటే?
ఇకపోతే ఈ బంగారు గనిని ఎలా కనుగొన్నారు? ఎప్పుడు కనుగొన్నారు.? పర్మిషన్ ఎలా లభించింది? తదితర విషయాల విషయానికొస్తే.. 2006లో ఈ గనుల లీజు కోసం జియో మైసోర్ సంస్థ దరఖాస్తు చేసుకుంది.;
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో.. ఇటు పెద్ద ఎత్తున బంగారు గనుల వేటలో శాస్త్రవేత్తలు పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ మొదలుకొని మహారాష్ట్ర, కర్ణాటక తోపాటు మరికొన్ని రాష్ట్రాలలో ఈ బంగారు గనులు బయటపడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఈ బంగారు గనులు భూమిలోనే కలిసిపోయాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తొలిసారి భారతదేశంలోనూ అందులోనూ ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మైనింగ్ ప్రారంభం కాబోతోందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకెళితే.. ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరి బంగారు ప్రాజెక్టు భారతదేశంలోనే తొలి బంగారు గనుల ప్రాజెక్టుగా ప్రైవేట్ రంగంలో రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టును జియో మైసోర్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో ఈ గోల్డ్ మైనింగ్ ఉంది. ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ వివరాల విషయానికొస్తే.. సుమారుగా 1,477 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించబడింది. ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్ , నార్త్, సౌత్ ఇలా నాలుగు దిక్కులలో ఈ గనుల బ్లాక్ లను కనుగొన్నారు. అంతేకాదు 8 నుండి 15 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. మొత్తం ఇక్కడ సుమారుగా 11.2 టన్నుల బంగారం నిలువలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ డెక్కన్ గోల్డ్ మైన్స్ 40% వాటా కలిగి ఉండగా.. త్రివేణి ఎర్త్ మూవర్స్ మిగిలిన 60% వాటా కలిగినట్లు సమాచారం.
ఇకపోతే ఈ బంగారు గనిని ఎలా కనుగొన్నారు? ఎప్పుడు కనుగొన్నారు.? పర్మిషన్ ఎలా లభించింది? తదితర విషయాల విషయానికొస్తే.. 2006లో ఈ గనుల లీజు కోసం జియో మైసోర్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. 2008లో మైనింగ్ ప్లాన్ ను ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఆమోదించగా.. 2010లో పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. ప్రాజెక్టు అభివృద్ధి కోసం 33 వేల మీటర్ల డ్రిల్లింగ్, ఐపీ సర్వేలు, మాగ్నెటిక్ సర్వేలు ఇలా అనేక అన్వేషణలను ఆ సంస్థ నిర్వహించడం మొదలుపెట్టింది. అలా మొదలైన ఈ ప్రాజెక్టు దాదాపు 2043వ సంవత్సరం వరకు చెల్లుబాటులో ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్టుకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ నుండి 2043వ సంవత్సరం వరకు అనుమతి లభించినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే ఈ పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తిలో మొదట 400 కిలోల టార్గెట్ గా పెట్టుకున్న ఈ సంస్థ ఇప్పుడు 750 కిలోల బంగారం వార్షిక ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ ప్రారంభంతో డెక్కన్ గోల్డ్ మైన్స్ షేర్లు 14% పెరిగాయి. ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రాజెక్టు ప్రారంభ సంవత్సరంలో రూ.350 కోట్ల ఆదాయం ఆశిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ గోల్డ్ మైన్ చాలామందికి నిరుద్యోగ సమస్యను తీర్చడమే కాకుండా ఆ ప్రాంత డెవలప్మెంట్ కి మరింత దోహాదపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇది ప్రారంభమైతే బంగారం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది అని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.