జగన్ రాజీనామా చెయ్...అన్నది కూటమి కాదు

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి ఏపీలో టీడీపీ కూటమి ఎంతటి ప్రత్యర్ధి పక్షమో కానీ అంతకు సమానంగా మరో పక్షం కూడా ఉంది.;

Update: 2026-02-12 03:53 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి ఏపీలో టీడీపీ కూటమి ఎంతటి ప్రత్యర్ధి పక్షమో కానీ అంతకు సమానంగా మరో పక్షం కూడా ఉంది. అదే కాంగ్రెస్. ఆ పార్టీ ఏపీలో ఏముంది అని అనుకోవచ్చు. కానీ పార్టీ ఉనికి పోరాటం చేస్తున్నా అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఆమె ఇతర పార్టీల ప్రత్యర్ధి మాత్రమే కాదు సొంత చెల్లెలు. ఇంటా బయటా ఆమె చేస్తున్న రచ్చ అయితే వైసీపీని ఉలిక్కిపడేలా చేస్తోంది. చెల్లెమ్మ ఏమి చేస్తుంది అని లైట్ తీసుకున్న వారికి 2024 ఎన్నికల్లో వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ రాయలసీమలో ఓటమి పాలు కావడం సీట్లు పోవడం అంటే దాని వెనక కాంగ్రెస్ ఓట్ల చీలిక ప్రభావం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి.

హాట్ కామెంట్స్ చేస్తూ :

ఈ మధ్య కాలంలో జగన్ గురించి పెద్దగా మాట్లాడలేదని షర్మిల విషయంలో రకరకాలైన తీరులో ప్రచారం సాగింది. అన్నా చెల్లెళ్ళు రాజీ పడుతున్నారు అని కూడా పుకార్లు షికారు చేశాయి. అయితే అవన్నీ తప్పు అని లేటెస్ట్ గా షర్మిల చేస్తున్న హాట్ కామెంట్స్ రుజువు చేస్తున్నాయి. ఈ మధ్యనే రాయలసీమకు ద్రోహం చేసిన వారిలో జగన్ బాబు ఇద్దరూ సరిసమానంగా ఉన్నారు అని షర్మిల ఘాటుగా విమర్శించారు. దాని కంటే ముందు పాదయాత్ర జగన్ చేసినా అధికారంలోకి రాలేరని జోస్యం చెప్పారు. ఆయనలో అహంకారం తగ్గాలని కూడా ఆమె సెటైర్లు వేశారు.

జగన్ తప్పుకోవాలంటూ :

ఇక తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ గవర్నర్ ప్రసంగానికి హాజరై కొద్ది సేపు ఉన్న తరువాత సభ నుంచి బయటకు వచ్చేశారు. దాంతో కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో షర్మిల వైసీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ టోటల్ గా విపక్షంగా ఫెయిల్ అయింది అని ఆమె నిందించారు. జగన్ విపక్ష నాయకుడుగా విఫలం అయ్యారు అని కూడా ఆమె విమర్శించారు. అసెంబ్లీకి వెళ్తే తనకు మైక్ కావాలని జగన్ మారాం చేయడం కాదని ఆమె ఎద్దేవా చేశారు. సొంత అజెండా పక్కన పెట్టి ప్రజా అజెండాతో అసెంబ్లీకి వెళ్లాలని ప్రజా సమస్యల మీద మాట్లాడాలని ఆమె సూచించారు. లేకపోతే జగన్ తో పాటుగా ఆయన ఎమ్మెల్యేలు అంతా తమ పదవులకు రాజీనామా చేసి తప్పుకోవాలని కూడా ఆమె ఫైర్ అయ్యారు.

వైసీపీ మీద ఒత్తిడి :

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల అన్నారని కాదు కానీ జనాలు కూడా వైసీపీ సభకు హాజరు కావాలనే కోరుకుంటున్నారు అని అంటున్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా చర్చించాలని అపుడే విపక్షానికి రాణింపు ఉంటుందని అంటున్నారు. లేకపోతే ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే పదవులు ఎందుకు అన్న చర్చ కూడా వస్తోంది. మరి వైసీపీ ఏమి చేస్తుంది ఏమి ఆలోచిస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News