మాజీ మంత్రి జోగికి మరిన్ని ఇబ్బందులు.. తెరపైకి కొత్త కేసులు!
అంతేకాకుండా జడ్పీ సభ్యురాలు రత్నకుమారికి రూ.2 లక్షలు, జోగి ప్రైవేటు పీఏ శ్రీనివాసరెడ్డికి రూ.8 లక్షలు ఒక సారి, రూ.3 లక్షలు మరోసారి ట్రాన్స్ ఫర్ చేశారు.;
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉచ్చు బిగించేలా ప్రభుత్వం పావులు కదుపుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కల్తీ మద్యం కేసులో అరెస్టు అయి నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి జోగిపై కొత్త కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సందేహిస్తున్నారు. గతంలో జోగి ప్రాతినిధ్యం వహించిన పెడన నియోజకవర్గం పరిధిలో ఓ భూ దందాలో మాజీ మంత్రి జోగి అనుచరులపై తాజాగా కేసు నమోదైంది. ఈ కేసులో బాధితుడు మాజీ మంత్రి జోగి పేరు ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రిపైనా చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతుందా? అనే సందేహం వైసీపీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది.
కృష్ణా జిల్లా కృత్తివెన్న మండలం ఇంతేరు అనే గ్రామంలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటుదిగా చూసి నరసాపురానికి చెందిన రొయ్యల వ్యాపారి తమ్ము కల్యాణ్ కుమార్ నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు డబ్బు వసూలు చేశారని ఈ నెల 13న ఫిర్యాదు అందింది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాజీ మంత్రి జోగి రమేష్ అభయం ఇవ్వడంతో ఆయన అనుచరులు అయిన కృత్తివెన్ను జడ్పీటీసీ మైలా రత్నకుమారి, మాజీ మంత్రి జోగి ప్రైవేటు సెక్రటరీ పులగం శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు మైలా రమేష్, వైదాని వెంకటరాజు, మైలా మహేశ్ రాజుకు దఫదఫాలుగా రూ.30 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. 2021 జులై 6న మైలా మహేష్ బాబుకు రూ.5 లక్షలు, అదే ఏడాది జులై 7న మరో రూ.10 లక్షలను బ్యాంకు అకౌంటుకే జమ చేసినట్లు బాధితుడు తన ఫిర్యాదులో వివరించారు.
అంతేకాకుండా జడ్పీ సభ్యురాలు రత్నకుమారికి రూ.2 లక్షలు, జోగి ప్రైవేటు పీఏ శ్రీనివాసరెడ్డికి రూ.8 లక్షలు ఒక సారి, రూ.3 లక్షలు మరోసారి ట్రాన్స్ ఫర్ చేశారు. ఇలా విడతల వారీగా సుమారు రూ.38 లక్షలు ఇచ్చినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా 2022 మే నెలలో పెడన నియోజకవర్గ పర్యటనకు మాజీ మంత్రి జోగి రాగా, ఒక ఇంట్లో ఆయన సమక్షంలో నగదు కూడా అందజేసినట్లు బాధితుడు వివరించాడు. దీంతో పోలీసులు వైసీపీ జడ్పీటీసీతోపాటు మిగిలిన వారిపై సెక్షన్ 420, 386, 506 ఆర్/డబ్ల్యూ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇంతేరు గ్రామంలో ప్రభుత్వ భూములను చూపి రొయ్యల వ్యాపారిని మోసం చేయడమే కాకుండా, ఆ డబ్బు తిరిగి ఇచ్చేయమంటే బెదిరించారని, హత్య చేస్తారని భయపెట్టారనే అభియోగాలు కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ అంశంపై వైసీపీ నేతలు పేర్లు ఉండటం ఒక ఎత్తైతే.. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయం ఉన్నట్లు పరోక్షంగా ఆయన సహకరించినట్లు ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించడమే చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే కల్తీ మద్యం కేసులో అరెస్టు అయిన ఆయనను జైలులో మరికొన్నాళ్లు ఉంచేలా ఈ కేసులో కూడా అరెస్టు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు నేరుగా జోగి పేరుపై ఫిర్యాదు చేయకపోయినా, ఆయన సమక్షంలో డబ్బు ఇచ్చానని, మాజీ మంత్రి హామీ ఇచ్చారని ఫిర్యాదులో ప్రస్తావించడం చూస్తే ప్రభుత్వం వ్యూహం ఏమైవుంటుందనే ఉత్కంఠ రేపుతోంది.