విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. పిక్స్ వైరల్!
అయితే అప్పటికే విమానం ల్యాండ్ అవుతుండటంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.;
ఇటీవల జరిగిన వరుస విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళన రేకెత్తించిన వేళ.. గత కొన్ని వారాలుగా అలాంటి సంఘటనలు జరగలేదనే చెప్పాలి! అయితే తాజాగా పక్షుల గుంపు ఒకటి విమానాన్ని ఢీకొట్టిన ఘటన తాజాగా జెడ్డాలో వెలుగు చూసింది. అయితే అప్పటికే విమానం ల్యాండ్ అవుతుండటంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.
అవును... అక్టోబర్ 25, శనివారం నాడు సౌదీ అరేబియాకు చెందిన ఎస్వీ 340 (బోయింగ్ 7-300) విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇందులో భాగంగా... అల్జీర్స్ నుండి బయలుదేరి జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సదరూ విమానం చేరుకుంటుండగా.. పెద్ద ఎత్తున ఉన్న పక్షుల గుంపు విమానాన్ని ఢీకొట్టింది.
ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేయబడిన చిత్రాలు విమానం ముక్కు భాగంలో చిందిన పక్షుల రక్తాన్ని చూపిస్తున్నాయి. దీనివల్ల విమానం ముందరి భాగం దెబ్బతిందని చెబుతున్నారు. ఆ సమయంలో ల్యాండింగ్ సేఫ్టీనే అని నిర్ధారించుకున్న పైలెట్లు.. ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు
ఈ సందర్భంగా స్పందించిన నిపుణులు... పక్షులు ఏవీ ఏ ఇంజిన్ లోకి ప్రవేశించకపోవడంతో ఇంజిన్ వైఫల్యం నివారించబడిందని.. ఫలితంగా పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు.
కాగా... అక్టోబర్ 10న పూణే నుండి ఢిల్లీకి వెళ్లే అకాసా ఎయిర్ విమానం (క్యూపీ 1607) ల్యాండింగ్ సమయంలో పక్షి ఢీకొట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక.. అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొనడంతో మయామిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
సీజనల్ బర్డ్స్ తో డేంజర్!:
జెడ్డా.. ఎర్ర సముద్రం వలస కారిడార్ వెంబడి ఉంది. ఇది శరదృతువు, వసంతకాల వలస కాలంలో భారీ పక్షుల కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ ప్రాంతంలో పక్షుల సందడి సాధారణంగా సెప్టెంబర్, నవంబర్ మధ్య ఎక్కువగా ఉంటుంది. దీని వలన విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు పర్యవేక్షణ, వన్యప్రాణుల నిర్వహణ చర్యలను పెంచుతాయి. విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. జెడ్డాలో రిస్క్ ఎందుకు ఎక్కువంటే..?
ఈ విమానాశ్రయాల సమీపంలో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పక్షులు ఢీకొనే సంఘటనలు తరచుగా జరుగుతాయి. ఇక్కడ విమానాలు తక్కువ ఎత్తులో, ఎక్కువ వేగంతో ఎగురుతుండటం వల్ల ప్రభావానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెబుతారు.