చాట్‌జీపీటీతో రాసినట్లున్నాయి.. ఇరాన్ ప్రతిపాదనలపై జేడీ వాన్స్ షాకింగ్ కామెంట్స్!

ఇరాన్ ప్రభుత్వం అమెరికాకు మొత్తం 10 పాయింట్లతో కూడిన ప్రతిపాదనలను పంపింది.;

Update: 2026-04-09 07:49 GMT

అమెరికా-ఇరాన్ సంబంధాల్లో సరికొత్త మలుపు చోటుచేసుకుంది. తాజా కాల్పుల విరమణ ప్రయత్నాల నేపథ్యంలో ఇరాన్ పంపిన ప్రతిపాదనలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా దౌత్యపరమైన పత్రాల రూపకల్పనలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రస్తావన రావడం టెక్ , రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మూడు వర్షన్లు.. మూడు వివాదాలు

ఇరాన్ ప్రభుత్వం అమెరికాకు మొత్తం 10 పాయింట్లతో కూడిన ప్రతిపాదనలను పంపింది. అయితే ఇవి ఒకేసారి కాకుండా మూడు వేర్వేరు వర్షన్లలో పంపడం, ఒక్కో వెర్షన్‌లో ఒక్కో రకమైన గందరగోళం ఉండటం అమెరికా అధికారులను విస్మయానికి గురిచేసింది.

చాట్‌జీపీటీ తరహా ప్రతిపాదన

జేడీ వాన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్ పంపిన మొదటి సెట్ ప్రతిపాదనలు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. "ఆ పాయింట్లు చూస్తుంటే ఎవరో చాట్ జీపీటీ తో రాయించినట్లుగా అనిపించాయి" అని ఆయన ఎద్దేవా చేశారు. దౌత్యపరమైన లోతు, స్పష్టత లేకపోవడంతో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ వాటిని పరిశీలించి వెంటనే తిరస్కరించారు.

అస్పష్టమైన రెండో వర్షన్

మొదటి ప్రయత్నం విఫలం కావడంతో ఇరాన్ రెండో వర్షన్‌ను పంపింది. ఇది మొదటి దానికంటే కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, కీలక అంశాల్లో స్పష్టత లేదని వాన్స్ పేర్కొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డోనాల్డ్ ట్రంప్ తన కాల్పుల విరమణ ప్రకటనలో ఈ రెండో వర్షన్‌కు సంబంధించిన కొన్ని అంశాలనే ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

వివాదాస్పద మూడో వర్షన్

అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ మూడో వర్షన్‌తో మొదలైంది. ఇది అధికారిక దౌత్య మార్గాల ద్వారా కాకుండా నేరుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం అమెరికాను షాక్‌కు గురిచేసింది. ఈ వెర్షన్‌లోని డిమాండ్లు అత్యంత కఠినంగా, అంగీకరించలేని విధంగా ఉన్నాయని.. ఇది మొదటి వర్షన్ కంటే దారుణంగా ఉందని వాన్స్ విమర్శించారు.

ఇస్లామాబాద్ వేదికగా చర్చలు

ఈ ఉత్కంఠ భరిత పరిణామాల మధ్యే, అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు రంగం సిద్ధమైంది. ఈ శనివారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా మొదటి విడత చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు జేడీ వాన్స్ స్వయంగా నేతృత్వం వహించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

చర్చల్లోని కీలక అంశాలు

లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కాల్పుల విరమణపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాన్స్ హెచ్చరించారు. ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై ప్రత్యేక పరిమితులు లేకపోవడం గమనార్హం. అంతర్జాతీయ వేదికపై ఇరాన్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.

సాధారణంగా అంతర్జాతీయ ఒప్పందాలు అత్యంత రహస్యంగా నిపుణులైన దౌత్యవేత్తల పర్యవేక్షణలో జరుగుతాయి. కానీ ఇరాన్ పంపిన ప్రతిపాదనలు ఏఐ తో రాసినట్లు ఉండటం, సోషల్ మీడియాలో లీక్ అవ్వడం వంటివి ఆధునిక రాజకీయాల్లో కొత్త ధోరణులను సూచిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లో జరగబోయే చర్చలు ఈ ప్రతిష్టంభనను తొలగిస్తాయా లేక కొత్త వివాదాలకు దారితీస్తాయా అన్నది వేచి చూడాలి. దౌత్యపరమైన పత్రాల్లో నాణ్యత లోపించడం అనేది కేవలం ఆ దేశ ప్రతిష్టనే కాకుండా ప్రపంచ శాంతి ప్రయత్నాలను కూడా నీరుగారుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News