'133, 143 అయినా పర్లేదు'... జేసీని ఆపడం కూటమికి అత్యవసరం!

అవును... జేసీ ప్రభాక‌ర్‌ రెడ్డి తీరు రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది.;

Update: 2025-07-22 05:33 GMT

ఇటీవల అనంత‌పురం జిల్లా పంచాయ‌తీ అధికారి నాగ‌రాజునాయుడిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మన్ జేసీ ప్రభాక‌ర్‌ రెడ్డి నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. జిల్లా అధికారిపై మీద మీదకూ వెళ్తూ అంద‌రి ముందు కొట్టేంత ప‌ని చేశారు. దీంతో... జేసీ వైఖ‌రి ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ, ప్రజానీకంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో తాజాగా ఏఎస్పీపై విరుచుకుపడ్డారు!

అవును... జేసీ ప్రభాక‌ర్‌ రెడ్డి తీరు రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడే ఆయన.. ప్రభుత్వ ఉద్యోగులపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరో అడుగు ముందుకేసి వారిపై చేయి కూడా చేసుకుంటారా అనేస్థాయిలో పరిస్థితి ఉందని అంటున్నారు. పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఆదేశించినా లైట్ అంటున్నారు!

ఈ సమయంలో తాజాగా తాడిప‌త్రి ఏఎస్పీ రోహిత్‌ కుమార్ చౌద‌రిపై జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. మీడియాతో మాట్లాడుతూ.. 'రోయ్' అంటూ ఏఎస్పీని తూల‌నాడారు. ప‌వ‌ర్‌ గ్రిడ్ కాంట్రాక్టర్ల నుంచి ఎంత ముట్టింది అని ప్రశ్నించారు. తనపై కేసులు పెట్టుకుంటే పెట్టుకోవాలని.. 133 కాస్తా 143, 153 అవుతాయని.. అయితే ఏమవుతుందని మాట్లాడారు.

"ఏమనుకుంటున్నావ్... ఏయ్.. ఏఎస్పీ.. నీ మీద కూడా కేసు పెడతా.. నీవల్లే మొన్న గలాటా అయ్యింది.. మా బాదలు మాకు ఉన్నాయి.. ఏఎస్పీ పొద్దున్నే వస్తున్నా.. నాకు జరిగిన అన్యాయానికి నువ్వు ఏమి చెబుతావో చెప్పు.. నాకు తెలియదా లా అండ్ ఆర్డర్.. నేను, నా భార్య, నా కోడలు నీ ఆఫీసు ముందు కూర్చుంటాం.. ఏమనుకుంటున్నవ్?" అంటూ ఫైర్ అయ్యారు.

ఇలా వరుసగా కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఆదేశాలను జరగనివ్వడం లేదనే చర్చతో పాటు మొన్న జిల్ల అధికారి, ఇప్పుడు ఏఎస్పీ.. ఇలా రోజు రోజుకీ వ్యవహారం ముదిరిపోతుండటంతో తీవ్ర చర్చ జరుగుతుందని అంటున్నారు. ఆయనను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది పరిశీలకుల మాటగా ఉంది.

కాగా... గత ప్రభుత్వ హయాంలో కూడా పలువురు వైసీపీ నేతలు ఇదే స్థాయిలో నోరేసుకుని పడిపోతూ, బీభత్స వాతావరణం సృష్టించారు. ఆ సమయంలో జగన్ వారిని నిలువరించడం లేదనే విమర్శలు వినిపించాయి. దానిపై నాడు విద్యావంతులు, మేధావులు, న్యూట్రల్స్ లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. ఫలితం 2024లో కనిపించింది! సో... జేసీ బ్రదర్ ని ఆపడం అత్యవసరం అనే మాటలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News